Letter Viral: ప్రభుత్వ టీచర్ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలం
Telangana Govt Teachers Against Family Survey: డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సర్వేలకు తమను వినియోగించుకుంటుండడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Family Survey: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నమ్మించిన మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటి మాత్రమే చెల్లించడంతో ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని నియంత్రించుకోలేక తమ సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. ఇక దీనికి తోడు సమగ్ర కుటుంబ సర్వేకు ఉపాధ్యాయులను వినియోగించుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉపాధ్యాయ వర్గం ఆగ్రహంతో ఊగిపోతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో జరుగుతున్న చర్చల్లో ఓ ఉద్యోగి రాసిన లేఖ కలకలం రేపింది.
Also Read: KTR: ప్రజా క్షేత్రంలోకి కేటీఆర్.. పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటన
ఉద్యోగ వర్గాల్లో ఓ సామాన్య ఉపాధ్యాయుడు రాసిన లేఖగా నెట్టింట్లో సంచలనం రేపుతున్న ఆ లేఖ ఇలా ఉంది. 'మనకు రావాల్సిన డీఏలు, జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, పీఆర్‌సీ, రిటైర్డ్ టీచర్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించేలా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించే సమర్ధత మన సంఘాలకు లేదు' అని ఆ ఉద్యోగి అసహనం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రితో బుధవారం జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఈ విషయంతో అర్థమవుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా తమ సంఘాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 'డిప్యూటీ సీఎం సమావేశంలో ఒకరిని మించి ఒకరు అతి వినయాన్ని ప్రదర్శించారు. ఉదయం, సెలవు రోజుల్లో కూడా సర్వే చేయడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చేశారు' అని తప్పుబట్టారు. 'రావాల్సి 5 డీఏలకు ఒకటి మాత్రమే సంఘం నాయకులు ఇప్పించగలిగారు. ఇంకా నాలుగు బకాయిపడ్డారు. అవి ఎప్పటికీ వస్తాయో.. రావో.. మీరు ఇప్పించగలరో.. లేదో కూడా అనుమానమే' అని ఆ ఉద్యోగి నిరాశ వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ 17 వాయిదాల్లో ఇస్తామంటే మీరు అదేమని ప్రశ్నించలేకపోయారని ఆ ఉద్యోగ సంఘం ప్రతినిధుల తీరును తప్పుబట్టారు. డిప్యూటీ సీఎం వద్ద సర్వేకు అంగీకరించడం ద్వారా చివరికి తాము ఇబ్బందులు పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రాముఖ్యం ఇస్తారని.. ఇప్పుడు తమ సమస్యలపై మాట్లాడడం లేదని మండిపడ్డారు. 'డ్యూటీ చేయడం ఎంత కష్టమో మీరు ఆలోచించారా? మీరు మా స్థానంలో ఉండి ఆలోచించండి. అప్పుడు మీకు మా బాధ తెలుస్తుంది' అని ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.