హైదరాబాద్: జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణపై తరచుగా వస్తోన్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 709 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రధాన రహదారుల నిర్వహణకు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు పిలవనుంది. గుంతల పూడ్చివేత, మరమ్మతులు, కొత్త రోడ్లు, లేయర్ల నిర్మాణానికి వేర్వేరుగా టెండర్లు పిలిచి.. టెండర్ దక్కించుకున్న వారికి ఆయా అభివృద్ధి పనులు అప్పగించాలని టీ సర్కార్ భావిస్తోంది. ఐదేళ్లపాటు వర్కింగ్ ఏజెన్సీలకే పనుల బాధ్యత అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 


ఇదిలావుంటే, నగరంలో అనుమతులు లేకుండానే నిత్యం ఎక్కడపడితే అక్కడ ఎవరి ఇష్టానుసారం వారు రోడ్లను తవ్వేస్తుండటంతో.. రోడ్లు బాగోలేవనే విమర్శలు అధికమయ్యాయి. విమర్శలకు తోడు ఆయా రోడ్ల నిర్వహణ భారం సైతం జీహెచ్ఎంసిపైనే పడుతోంది. దీంతో ఇకపై రోడ్లు, ఫుట్‌పాత్‌లు తవ్వాలంటే సంబంధిత అధికారులకు ఆరు నెలల ముందుగానే సమాచారం ఇచ్చేలా ఓ నిబంధనను తీసుకువచ్చినట్టు జీహెచ్ఎంసి అధికారులు తెలిపారు.