తెలంగాణ సర్కార్  రైతులకు భరోసా ఇచ్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది.  పంట పెట్టుబడి మద్దతు పథకం ద్వారా రైతులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రగతిభవన్‌లో రైతు పెట్టుబడి పథకం, వ్యవసాయ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్టుబడి సాయానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత  వానాకాలం పంటకు సాయం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.  పంట వేసుకోవడానికి ఎకరానికి రూ.4 వేలు చొప్పున అందించే కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే యాసంగి పంట కోసం ఇచ్చే పెట్టుబడి పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 18నుంచి నిర్వహించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన నిధులను బడ్జెట్‌లోనే కేటాయించనున్నట్టు సీఎం ప్రకటించారు. పంట పెట్టుబడి సాయం మొత్తం చెక్కుల రూపంలో అందించాలని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్


సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో రైతు సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి.  రైతులకు ఊరట కల్గించేందుకు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ డ్రాప్ట్‌ను రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా సబ్సిడీపై వరినాట్ల యంత్రాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 42 మందితో రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  వ్యవసాయ రంగ విధివిధానాల్లో రైతు సమితుల పాత్రపై చర్చించేందుకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా  ఈ నెల 25న హైదరాబాద్‌లో.. 26న కరీంనగర్‌లో మండల రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.