Heavy Rains Impact: భారీ వర్షాల ప్రభావం, ములుగు అడవుల్లో చిక్కుకున్న 82 మంది పర్యాటకులు
Heavy Rains Impact: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల్లో పెద్దఎత్తున పర్యాటకులు చిక్కుకుపోయారు. ములుగు జిల్లా అడవుల్లో ఇరుక్కుపోయిన పర్యాటకుల్ని రక్షించే చర్యలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Heavy Rains Impact: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎక్కడికక్కడ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకృతి అందాల్ని ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులు భారీ వర్షాల కారణంగా అడవుల్లో చిక్కుకుపోయారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 82 మంది పర్యాటకులు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారడంతో గత 2-3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు హఠాత్తుగా స్థంభించిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా 82 మంది పర్యాటకులు ములుగు జిల్లా అడవుల్లో చిక్కుకుపోయారు. అసలేం జరిగిందంటే..
ములుగు జిల్లాలోని ముత్యంధార జలపాతానికి వర్షాకాలంలో పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. ఇందులో భాగంగానే జలపాతం సందర్భనకు దాదాపు 82 మంది పర్యాటకులు వెళ్లారు. వీరభద్రపురంలో 15 కార్లు, 10 బైకులు పార్క్ చేసి జలపాతాన్ని సందర్శించారు. తిరుగు ప్రయాణంలో అక్కడున్న వాగు ఒక్కసారిగా పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ వాగు దాటలేక అడవిలో ఆగిపోయారు. దాంతో పర్యాటకుల్ని కాపాడేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అడవిలో చిక్కుకున్న పర్యాటకుల్ని కాపాడతామని అధికారులు తెలిపారు.
మరోవైపు డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రంగంలో దింపారు. ఇప్పటికే అడవిలో చిక్కుకున్న పర్యాటకులతో సహాయక బృందాలు మాట్లాడాయి. వాగు దాటేందుకు ఎవరూ పొరపాటున కూడా ప్రయత్నించవద్దని..అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సూచించారు. ఈలోగా అడవిలో చిక్కుకున్న పర్యాటకులకు కావల్సిన ఆహార పదార్ధాలు, రక్షణ పరికరాల్ని పంపిస్తున్నామని తెలిపారు.
అర్ధరాత్రి కావడంతో పాటు భారీ వర్షం, అటవీ ప్రాంతం అవడంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోందని తెలుస్తోంది. ముత్యంధార జలపాతం వెంకటాపురం మండలంలోని దట్టమైన అడవుల్లో ఉంటుంది. జాతీయ రహదారి నుంచి 12 కిలోమీటర్లు అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. జలపాతానికి చేరుకోవాలంటే మూడు కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి భారీ వర్షాల నేపధ్యంలో ముత్యంధార జలపాత సందర్శనను అటవీ శాఖాధికారులు నిషేధించారు. అయితే పర్యాటకులు లెక్కచేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook