తెలంగాణ సర్కార్‌కి హై కోర్టు సూటి ప్రశ్నలు, ఆదేశాలు
తెలంగాణ సర్కార్‌కి హై కోర్టు సూటి ప్రశ్నలు ప్రశ్నలు, ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై నేడు విచారణ జరిగింది. ఇప్పటికే వినియోగంలో వుండి, ఇంకా వినియోగించుకోవడానికి వీలుగా ఉన్న నిర్మాణాలను వదిలేసి వాటికి బదులుగా కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా హై కోర్టు తెలంగాణ సర్కార్‌ని ప్రశ్నించింది. ఇరుంమంజిల్ భవనం, హెరిటేజ్ భవనాన్ని కూల్చడానికి సరైన కారణాలు ఏంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై ప్రభుత్వం వద్ద ఉన్న ప్లాన్స్... నూతన భవనాల నిర్మాణ అవసరాలపై వివరాలు అందించాలని కోర్టు తెలంగాణ సర్కార్‌కి ఆదేశాలు జారీచేసింది. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, తదితరులు 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి పిల్‌పై రేపే విచారణ:
సచివాలయ భవనాల కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం వినియోగంలో వున్న భవనాలు మరో 50-70 ఏళ్ల వరకు పటిష్ఠంగా ఉంటాయని, అలాంటి భవనాలను కూల్చి నూతన భవనాలు నిర్మించాలనుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో గతంలో దాఖలైన పిటిషన్ సైతం శుక్రవారం విచారణకు రానున్నందున.. రేవంత్ రెడ్డి పిటిషన్‌ను సైతం దాంతోపాటే విచారిస్తామని కోర్టు తేల్చిచెప్పింది.