నైపుణ్య శిక్షణ అంటే అందరినీ తీసుకెళ్లి కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టడం ఒక్కటే కాదు... ఏళ్ల తరబడి కులవృత్తు్ల్లో కొనసాగుతున్న వారి బతుకుదెరువు కోసం వారి వారి వృత్తులను ప్రోత్సహించడం కూడా నైపుణ్య శిక్షణే అవుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గొర్లు, బర్లు పంచిపెడుతూ అదే అభివృద్ధి అని చెప్పుకుంటే, మరి నేటి యువతకు నైపుణ్య శిక్షణ సంగతి ఎంటని ప్రతిపక్షాలు విసురుతోన్న వ్యంగ్యాస్త్రాలపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మధ్యాహ్నం షాద్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వయసు పైబడినా ఇంకా కుల వృత్తులనే నమ్ముకున్న పెద్దోళ్లకు గొర్లు, బర్లు పంపిణీ చేయడం తప్పిదం ఎలా అవుతుందని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లంబాడి తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించడాన్ని మంత్రి కేటీఆర్ ఈ సభలో ప్రస్తావించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దశాబ్ధాల తరబడి లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని హామీ ఇస్తూ వచ్చాయే తప్ప ఏ నాయకుడూ ఆ పనిచేయలేదు. ఇన్నేళ్ల తర్వాత లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఏకైక ఘనత కేసీఆర్ సర్కార్‌దే అవుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు. మహబూబ్ నగర్ జిల్లా వెనుకబాటుతనానికి గురికావడానికి ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులే కారణం అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. షాద్‌నగర్ సభను వేదికగా చేసుకుని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలను అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేసే కాంగ్రెస్ నాయకులు మళ్లీ జిల్లాల్లో ఏమీ తెలియని అమాయకుల్లా తెలంగాణలో అభివృద్ధి ఏదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కేటీఆర్ మండిపడ్డారు. ఇకపై ఎవరైనా కాంగ్రెస్ నేతలు నీటి గురించి కేసీఆర్ సర్కార్‌ని విమర్శిస్తే.., ముందుగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా వేసిన కేసుల సంగతేంటని ప్రజలే ఆ కాంగ్రెస్ నాయకులను నిలదీయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ మహబూబ్‌నగర్ ప్రజానికానికి కేటీఆర్ సూచించారు.