Revanth Reddy Slams KCR and KTR: “కేసీఆర్ కుటుంబం తమ స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని బలి చేస్తారా? 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం విధ్వంసానికి గురైంది. తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమేనా ? నిజాం కూడా హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసం సృష్టించలేదు” అని కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. భూ దోపీడీలో భాగంగా రూ. 100 కోట్ల విలువైన ఆస్తిని రూ. 17 కోట్లకే కేసీఆర్ కుటుంబం కొట్టేసిన వైనాన్ని బుధవారం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి వెల్లడించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి.  కేబీఆర్ పార్క్ దగ్గర నిర్మాణాలకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఇవి ఎత్తయిన ప్రదేశాలు కాబట్టి విమానాల రాకపోకలకు అడ్డురాకుండా నిర్మాణాల కోసం ఎయిపోర్ట్ సంస్థ వారి పర్మిషన్ కూడా తీసుకోవాలి. అందుకే పార్క్ చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప్రత్యేక నైసర్గిక స్వరూపం ఉన్న నేపథ్యంలో అక్కడ భవన నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలను అమలు చేసే వారు. వాటి ప్రకారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి 3 అంతస్థులకు, కమర్షియల్ నిర్మాణాలకు 5 అంతస్థులకు మాత్రమే అనుమతి ఇచ్చేవారని తెలిపారు.
 
కేబీఆర్ పార్కును ఎకో టూరిజం, ఎకో సెన్సిటివ్ జోన్ గా పరిగణిస్తారు. దాని చుట్టూ కూడా ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అందుకే కేబీఆర్ పార్కు పరిసరాల్లో కమర్షియల్ భవనాలు చాలా తక్కువ. కేసీఆర్ వచ్చాకే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలు పెరిగాయన్నారు. కేబీఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన ఒక హెరిటేజ్ భవనం ఉండేది. ఈ భవనాన్ని కుర్ర శ్రీనివాస రావుకు చెందిన కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ  కొనుగోలు చేసింది. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని మా శాసనసభ్యుడు సంపత్ కుమార్ అసెంబ్లీలో మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తితే కేసీఆర్ దబాయించే ప్రయత్నం చేశారన్నారు. అక్కడ మొత్తం ఏరియా 7415 గజాలు. 500 గజాలు రోడ్డు వెడల్పు పోగా 6900 గజాలు మిగిలింది. గత నిబంధనలకు ఇందులో 1200 గజాలు గ్రీన్ బెల్ట్..మిగిలిన 5800 గజాలకు 60 వేల చదరపు అడుగులకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 2016లో కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ యజమాని భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్ నేతలు బెదిరించి ఒత్తిడి తెచ్చి అందులో 2704 గజాల భూమిని నమస్తే తెలంగాణ ఎండీ, చైర్మన్ దామోదర్ రావు పేరు మీద రాయించుకున్నారు. 2019లో రెండోసారి ప్రభుత్వం వచ్చాక శ్రీనివాస రావు ఆస్తిని బదలాయించారు. దాని ప్రతిఫలంగా పాత నిబంధనల మేరకు 5 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇవ్వని చోట.. 21 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. 3 వేల గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా పర్మిషన్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కూడా చదవండి: Minister KTR: నా తల్లి నాకు జన్మనిస్తే.. రాజకీయ జన్మ ఇచ్చింది సిరిసిల్ల.. మంత్రి కేటీఆర్ ఎమోషనల్


ఇదే ప్రదేశంలో నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావుకు 2704 గజాల భూమిని అప్పనంగా కట్టబెట్టారు. ఇందుకోసం ఆ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. 5 అంతస్థుల కంటే ఎక్కువ అనుమతి ఇవ్వవద్దని నిబంధనలు చెబుతున్నాయి. కానీ నమస్తే తెలంగాణకు భూమి రాసిచ్చాక కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ సంస్థకు 4 అంతస్తులు భూమిలోపల, గ్రౌండ్ ఫ్లోర్, 16 అంతస్తులు భూమి పైన కట్టుకునెలా మొత్తం 21 అంతస్థులకు అనుమతులు ఇచ్చారు. నమస్తే తెలంగాణకు కేసీఆర్ యజమాని.. భూమి రాసిచ్చాక నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారు. 4,78,825 చదరపు అడుగుల నిర్మాణాలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. 3 వేల గజాల్లోనే ఇలాంటి అనుమతులు ఇస్తే... పర్యావరణ పరంగా పార్కు పరిస్ధితి ఏమిటి? 21 అంతస్థుల అపార్ట్‌మెంట్ వల్ల కేబీఆర్ పార్క్ దగ్గర  భారీగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. 


ఆ భవనంలో నివసించే వారు వాడే ఏసీలతో వెలువడే వాయువులతో కేబీఆర్ పార్కులోని జాతీయ పక్షి నెమలి, ఇతర పక్షుల ఉనికికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అక్కడ పర్యావరణం దెబ్బతినే పరిస్థితులు తలెత్తవచ్చు అని రేవంత్ రెడ్డి చెప్పారు. అదే ప్రాంతంలో 7 ఎకరాల్లో ఉన్న బసవతారకం ఆసుపత్రికి కూడా 3 అంతస్థులకు మించి అనుమతులు ఇవ్వలేదు. ఆనాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి పాలకులు విధ్వంసం సృష్టించలేదు అని రేవంత్ రెడ్డి తెలిపారు.


ఈ భూదోపీడీలో 100 కోట్ల విలువైన 2,704 గజాల భూమిని రూ. 17 కోట్లకే కేసీఆర్ కొట్టేసిండని రేవంత్ రెడ్డి ఆరోపించారు. “కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. రూ. 17 కోట్లు కాదు.. రూ. 40 కోట్లు ఇస్తే కేసీఆర్ ఆ భూమిని ఇవ్వగలడా? బెదిరించి భూములు రాయించుకున్నారనడానికి ఇది నిదర్శనం కాదా? దోపిడీ అనే పదం కూడా కేసీఆర్ దోపిడీ ముందు చిన్నది అవుతుంది. వాళ్ళ కోసం నిఘంటువులో కొత్త పదం సృష్టించాలి” అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ విధ్వంసాన్ని మీడియా సాక్షిగా నిరూపించేందుకు సిద్ధమని తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఆ భవనం వద్దకు తీసుకెళ్లి చూపిస్తా అన్నారు.


వాస్తవాలు చెబితే కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్, అతని తండ్రి కలిసి ఇంత విధ్వంసం చేస్తారా? నమ్మి రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇంత విధ్వంసం చేస్తారా? కమీషన్ల మీద ఆశతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తూ పోవడం వల్లే నగరంలో ట్రాఫిక్జామ్ లు, చిన్నపాటి వర్షానికే వరదలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసానికి కారణమవుతున్న డీ9(దావూద్ 9) గ్యాంగ్ .. సీఎం కేసీఆర్, కేటీఆర్, సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, వెంకట్రామి రెడ్డి, వీళ్లలో ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 20 శాతం భూములు రాసిచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతిచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ట అని.. మీ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఇంత విధ్వంసం సృష్టిస్తారా? అని  రేవంత్ రెడ్డి మండిపడ్డారు.


ఇది కూడా చదవండి: EC Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook