Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లాల్లోని జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరుతుండడంతో కౌలస్ నాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు జలకళతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద నీటి ఉదృతి పెరిగితే ఏ క్షణంలో నైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలాలకు వరప్రదాయని అయిన కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లోకి మంగళవారం 577 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు కాగా ప్రస్తుతం 456.95 మీటర్లుకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.994. టీఎంసీలకు చేరుకుంది. ఇలాగే ఎడతెరపి లేకుండా వర్షం కురిస్తే ఏ క్షణానైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 


నిజామాబాద్ జిల్లా
ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో వరద తాకిడికి గురైన ప్రాంతాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి తీవ్రతను పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వస్థలమైన వేల్పూరులో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 46.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వర్ష తాకిడికి లోనై కట్టలు తెగి గండ్లు పడిన మర్సుకుంట చెరువు, కాడి చెరువులను, తెగిపోయిన ప్రధాన రహదారులు, జలమయంగా మారిన వేల్పూర్ పోలీస్ స్టేషన్, నివాస ప్రాంతాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేల్పూర్ మండలం జానకంపేట్ చెరువు, పచ్చలనడకూడలోనూ తెగిన చెరువు, కొట్టుకుపోయిన బీ.టీ రోడ్డును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక మేటలు వేసిన పంటలను పరిశీలించి, అధైర్యపడవద్దు... అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి కల్పించాలని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 


ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం ఎనిమిది చోట్ల అత్యధిక వర్షం కురిసి రెడ్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించగా, వాటిలో నిజామాబాద్ జిల్లాలోనే ఐదు ప్రాంతాలు పెర్కిట్, వేల్పూర్, భీంగల్, కోనసముందర్, జక్రాన్పల్లి ఉన్నాయని తెలిపారు. వీటిలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ సెగ్మెంట్ లోని మూడు ప్రాంతాలు వరద తాకిడికి లోనయ్యాయని, అత్యధికంగా రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆరు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వేల్పూర్ లో 46.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అన్నారు. 


కుండపోత వర్షం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, అక్కడక్కడ ఇసుకమేటలు వేసి పంటలు దెబ్బతినడం బాధ కలిగించిందన్నారు. తెగిన రోడ్లు, గండ్లు పడిన చెరువులను ప్రభుత్వపరంగా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపధ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశామన్నారు. గ్రామాభివృద్ది కమిటీలు కూడా వర్ష పరిస్థితిని గమనిస్తూ, ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగి, రోడ్లు కొట్టుకుపోతే తక్షణ చర్యలు చేపట్టాలని, అధికారులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ హెచ్చరికలు చేసినందున రైతులు, ప్రజలెవరూ చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి