TSRTC Luggage Charges: తెలంగాణ ఆర్టీసీ వీర బాదుడు.. అమాంతం భారీగా పెరిగిన లగేజీ ఛార్జీలు.. సామాన్యులకు చుక్కలే..
TSRTC Hikes Luggage Charges: టీఎస్ఆర్టీసీ లగేజీ ఛార్జీలను అమాంతం భారీగా పెంచేసింది. అదనపు లగేజీపై భారీగా ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
TSRTC Hikes Luggage Charges: తెలంగాణ ఆర్టీసీ మరోసారి ఛార్జీల మోత మోగించింది. చాలాకాలంగా స్థిరంగా ఉన్న లగేజీ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనపు లగేజీపై భారీ స్థాయిలో ఛార్జీలను పెంచేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ఏకంగా 20 రెట్లు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఏకంగా 25 రెట్లు మేర ధర పెరిగింది. అంతేకాదు, 50 కేజీల లోపు ఉచిత లగేజీ పరిమితిపై కూడా కొత్త నిబంధనలు విధించింది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం (జూలై 22) నుంచే అమలులోకి రానున్నాయి.
పెరిగిన లగేజీ ఛార్జీల వివరాలు :
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 50 కేజీల లోపు లగేజీ ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. 50 కేజీలకు మించితే నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ ఈసారి ఆ ఛార్జీలను అమాంతం భారీగా పెంచేశారు.
ఇదివరకు పల్లె వెలుగు బస్సుల్లో 0-25కి.మీ దూరానికి 50 కేజీల లగేజీపై రూ.1 ఛార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.20కి పెంచారు.
26కి.మీ-50కి.మీ దూరానికి 50 కేజీల లగేజీపై ఇదివరకు రూ.2గా ఉన్న ఛార్జీని ఇప్పుడు 40కి పెంచారు.
ఇక ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 0-50కి.మీ దూరం వరకు ఇదివరకు 50కేజీల లగేజీపై రూ.2 మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఇప్పుడది ఏకంగా 50కి చేరింది. అంటే.. 25 రెట్లు పెరిగినట్లు.
ఉచిత పరిమితి లగేజీపై కూడా బాదుడే :
ఆర్టీసీ బస్సుల్లో గతంలో లాగే ఇప్పుడు కూడా 50 కేజీల లోపు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే ఆ లగేజీ పరిమాణం మూడు ప్యాక్‌లు లేదా బ్యాగులకు మించకూడదు. అందునా.. ఒక్కో ప్యాక్ 25 కేజీలకు ఒక్క కేజీ మించినా.. దాన్ని రెండో యూనిట్‌గా పరిగణించి ఛార్జీలు వసూలు చేస్తారు.
ఆర్టీసీ యాజమాన్యం ఏం చెబుతోంది :
ఇప్పటికే ఆర్టీసీలో టికెట్ల ధరల పెంపుతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. తాజాగా లగేజీ ఛార్జీలపై బాదుడు చిరు వ్యాపారులకు భారంగా మారనుంది. అయితే ఆర్టీసీ మాత్రం ఈ పెంపు సరైనదేనని చెబుతోంది. 2002 తర్వాత లగేజీ ఛార్జీలను పెంచిన దాఖలాలు లేవని అంటోంది. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో పాటు మానవ వనరుల వ్యయం పెరగడంతో లగేజీ ఛార్జీలు కూడా పెంచక తప్పలేదని చెబుతోంది. ఈ ఛార్జీల పెంపు ఆర్టీసీ కార్గో సేవల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. రెండింటిలో ఛార్జీలు సమానంగా ఉండటంతో లగేజీ తరలింపు కోసం ప్రయాణికులు కార్గో వైపు మొగ్గుచూపుతారని భావిస్తోంది.
Also Read: Drones in Agriculture: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..
Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook