రాష్టవ్య్రాప్తంగా సోమవారం రాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా జెన్‌కో-ట్రాన్స్‌కో ఏర్పాట్లను పూర్తిచేసింది. ఐదారు రోజులపాటు ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఎదురయ్యే ప్రభావాన్ని అన్ని కోణాల్లో అంచనా వేసి తదుపరి కార్యాచరణను రూపొందిస్తారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ- 'వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నది నా స్వప్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  విద్యుత్ సమస్య ఉండకూడదని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే నిశ్చయించుకున్నా. ఇదే విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వివరించి 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించానని ముఖ్యమంత్రి చెప్పారు. నా కలను సాకారం చేయడానికి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చేసిన కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. మిషన్ కాకతీయ వల్ల రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయన్నారు. దీంతో 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులు బాగుపడితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు.