మానవత్వానికి మచ్చుతునక.. ఆ ట్రాఫిక్ పోలీస్ చేసిన పని..!
సాధారణంగా పోలీసులకు మానవత్వం అనేది ఉండదని.. వారివి కఠిన హృదయాలని కొందరు అంటూ ఉంటారు. సినిమాల్లో అప్పుడప్పుడు పోలీస్ పాత్రలను అలా చూపించడం వలనేమో..అలాంటి అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది.
సాధారణంగా పోలీసులకు మానవత్వం అనేది ఉండదని.. వారివి కఠిన హృదయాలని కొందరు అంటూ ఉంటారు. సినిమాల్లో అప్పుడప్పుడు పోలీస్ పాత్రలను అలా చూపించడం వలనేమో.. అలాంటి అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది. కానీ.. ఎవరో కొందరు తప్పించి అందరూ అలాగే ఎందుకు ఉంటారు..? హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ చేసిన పని చూస్తే.. అసలు సిసలైన మానవత్వానికి ఆయన ప్రతీక అనిపించక మానదు. కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుగా పనిచేస్తున్న బి.గోపాల్ తన విధులను నిర్వర్తిస్తుండగా.. ఓ టీస్టాల్ వద్ద దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడుతున్న ఓ ముసలామెను చూసి జాలిపడ్డారు.
ఆమెకు ఏదైనా సహాయం చేద్దామనుకున్నారు. ఆమె గురించి ఎంక్వయరీ చేస్తే తనను సొంత కొడుకులే వదిలేశారని తెలుసుకొని బాధపడ్డారు. ఆమె కోసం టిఫిన్ తెప్పించి ఇవ్వమని తెలిపారు. కానీ ఆమె కాలు, చేతులు కూడా కదపలేని పరిస్థితిలో ఉండడం చూసి.. తానే స్వయంగా ఆమెకు టిఫిన్ తినిపించారు. ఆ తర్వాత ఆమెను స్థానికంగా ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించారు.
అయితే ట్రాఫిక్ పోలీసు.. రోడ్డుపై అలమటిస్తున్న ఆ వృద్ధురాలికి టిఫిన్ తినిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సంఘటన ఆ తర్వాత తెలంగాణ డీజీపీకి చెందిన పీఆర్‌ఓ హర్ష భార్గవి వరకు చేరింది. ఆమె ఆ పోలీసును అభినందిస్తూ.. ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. విషయం తెలుసుకున్న తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డితో పాటు సైబరాబాద్ పోలీస్ కమీషనరు విసి సజ్జనర్, ఆ హోంగార్డుకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి కూడా అభినందించారు.