తెలంగాణలో 7,8, 9,10 తేదీల్లోనూ ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. జార్ఖండ్ మీదుగా వ్యాపించిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పాటు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకోవడం దీనికి కారణంగా అధికారులు వెల్లడించారు. కాగా శుక్రవారం రాత్రి గాలులతో కూడిన వర్ష ప్రభావానికి అక్కడక్కడా రోడ్లపై చెట్లు, కొమ్మలు, కరెంటు తీగలు తెగి పడడంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లో వర్షభీభత్సం


శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరవాసులను హడలెత్తించింది. రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట్, ముషీరాబాద్, బోయిన్‌పల్లి, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, ఉప్పల్, కర్మన్‌ఘాట్, హయత్‌నగర్‌ ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 5.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాటర్‌లాగింగ్‌ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, కూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు తొలగించాలని మేయర్‌ బొంతు రామ్మోహన్, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.