పిల్లలు లేని తమకు ప్రజలే కుటుంబం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
పిల్లలు లేని తమకు ప్రజలే కుటుంబం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలకవీడు మండలంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. పిల్లలు లేని తమకు నియోజకవర్గ ప్రజలే కుటుంబమని, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో గడువు పూర్తవగా అంతిమంగా ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు నిలిచారు. 21న జరిగే ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల నుంచి నలమాద పద్మావతిరెడ్డి(కాంగ్రెస్), శానంపూడి సైదిరెడ్డి(టీఆర్‌ఎస్), కోట రామారావు(బీజేపీ), చావా కిరణ్మయి(టీడీపీ) పోటీ చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో 7 స్థానాల్లో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌కు హుజూర్‌నగర్‌లోనూ ఓటమి భయం పట్టుకుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ ఖుంతియా విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ సీపీఐ మద్దతు తీసుకుంటోందన్న ఖుంతియా... అసలు టీఆర్‌ఎస్‌కు సీపీఐ ఎందుకు మద్దతు ప్రకటించిందో తెలియదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన ఖుంతియా.. ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటారని స్పష్టంచేశారు.