Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి
Congress Vijayabheri Yatra in Kosgi: కొడంగల్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండని కోరారు రేవంత్ రెడ్డి. కొడంగల్‌ను అభివృద్ధి చేసింది తాను అని.. మన బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
Congress Vijayabheri Yatra in Kosgi: కోస్గి ప్రజలు రెండుసార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి తనను గెలిపించారని.. మీరు పెంచిన మొక్క వృక్షమై పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండే స్థాయికి చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట నుంచి ఒకడు.. సిరిసిల్ల నుంచి ఇంకొకడు.. గజ్వేల్ నుంచి మరొకడు కొడంగల్‌కు గొడ్డలి తీసుకుని బయలుదేరారని.. తండ్రీకొడుకులు, అల్లుడు, వాళ్ల చెంచాలు ఈ చెట్టును అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ల మోచేతి నీళ్లు తాగిన వాళ్లు ఈ కుట్రలో భాగస్వాములై సహకరిస్తున్నారని విమర్శించారు. మీరు పెంచిన చెట్టును ఎవడో గొడ్డళ్లు తీసుకుని నరకాలని చూస్తుంటే మీకు పౌరుషం లేదా..? అని అడిగారు. కోస్గిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన మాట్లాడారు.
"కొడంగల్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ ఐదేళ్లలో కొడంగల్‌కు చేసిందేంటి..? బస్టాండు , సబ్ స్టేషన్, కాలేజీ, ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టించింది నేను కాదా..? ఇంటికొచ్చి ఏదైనా అడిగితే.. ఎవరైనా సాయం కోరి వస్తే ఏనాడైనా కాదన్ననా..? ఏ రోజైనా ఎవరి దగ్గర నుంచైనా ఒక్క రూపాయి అడిగానా..? గౌడ సోదరులకు, ముదిరాజులకు, దళిత బిడ్డల అభివృద్ధికి నేను కృషి చేశా. మైనారిటీలకు కమ్యూనిటీ భవనం కట్టించా. మార్కెట్ యార్డు కట్టించింది.. అభివృద్ధి చేయించింది నేను. నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫార్మర్స్ తెచ్చి అగ్గిపెట్టెల్లా పంచింది నేను. పదేళ్లు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇవన్నీ చేసింది నిజం కాదా..?
కానీ కేసీఆర్ మాటలు నమ్మి గత ఎన్నికల్లో మీరు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించారు. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చారు..? కృష్ణా జలాలు వచ్చాయా..? పాలమూరు ఎత్తిపోతల పూర్తయిందా..? రైల్వే లైన్ తెచ్చిండా..? పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా..? ఇవేవీ చేయకపోగా కొడంగల్‌ను రెండు ముక్కలు చేసి కుక్కలు చించిన విస్తరి చేశారు. అలాంటి కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి. కొడంగల్ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి.. కొడంగల్ ప్రజలారా.. ఆలోచించండి.. మన బతుకులు మారాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలి.. గ్రూపులు, గుంపులు పక్కనబెట్టి కలిసికట్టుగా కాంగ్రెస్‌కు అండగా నిలబడాలి.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. ధరణి రద్దు చేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ చెప్తుండు. కానీ రైతులకు నేను స్పష్టంగా చెబుతున్నా.. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇచ్చే బాధ్యత మాది. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తాం.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ అందిస్తాం.. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షలు సాయం అందిస్తాం.. కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్ చెసి.. మొత్తం ఒకే జిల్లాకు తేవాలంటే... కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.." అని రేవంత్ రెడ్డి అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook