Munugode Bypoll: మునుగోడు బీజేపీలో ముసలం.. ఈటల రాజేందర్ పై గొంగిడి టీమ్ ఆగ్రహం
Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఓ రేంజ్ లో ఉంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కు వ్యతిరేకంగా తీన్మానం చేసేవరకు వెళ్లింది. కాంగ్రెస్ లోనూ టికెట్ లొల్లి కొనసాగుతోంది. పాల్వాయి స్రవంతి ఆడియా లీకై వైరల్ గా మారింది. తాజాగా కమలం పార్టీలోనూ ముసలం పట్టినట్లు తెలుస్తోంది.
Munugode Bypoll: మునుగోడు.. ఇదే ఇప్పుడు తెలంగాణలో మార్మోగుతున్న పేరు. ఎక్కడికి వెళ్లినా మునుగోడు గురించే చర్చ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ప్రస్తుతం అన్ని పార్టీల ఫోకస్ మునుగోడుపైనే. పార్టీ చీఫ్ నుంచి గ్రామ స్థాయి నేతవరకు అంతా ఛలో మునుగోడు అంటూ పరుగులు పెడుతున్నారు. ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. అయితే అసమ్మతి, వలసలు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఓ రేంజ్ లో ఉంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కు వ్యతిరేకంగా తీన్మానం చేసేవరకు వెళ్లింది. బీసీ నినాదం టీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తోంది. కాంగ్రెస్ లోనూ టికెట్ లొల్లి కొనసాగుతోంది. పాల్వాయి స్రవంతి ఆడియా లీకై వైరల్ గా మారింది. కాంగ్రెస్ లో కలకలం స్పష్టించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కే అసమ్మతి బెడద ఉందని ఇప్పటివరకు భావిస్తుండగా.. తాజాగా కమలం పార్టీలోనూ ముసలం పట్టినట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు కమలం గూటికి చేరుతున్నారు. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటల రాజేందర్ మునుగోడులో తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. మునుగోడుతో ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజేందర్ సతీమణి జమునారెడ్డి స్వగ్రామం మునుగోడు నియోజకవర్గమే. అత్తారింటికి తరచూ వచ్చి వెళ్లే రాజేందర్ తో నియోజకవర్గంలోని నేతలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో ఇతర పార్టీల నేతలతో మాట్లాడి బీజేపీలో చేరేలా ఆకర్షిస్తున్నారు. ఈటల ఆపరేషన్ ఆకర్ష్ తో ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ ఖాళీ అయిందని చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సంబంధం లేకుండా రాజేందర్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు కషాయ కండువా కప్పుకుంటున్నారు. ఈ చేరికలే మునుగోడు బీజేపీలో వివాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అప్పుడే కోల్డ్ వార్ మొదలైందని చెబుతున్నారు.
స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా బీజేపీ లో చేరుతున్నారని.. అలాంటి వారితో పార్టీకి నష్టమని ముందు నుంచి బీజేపీలో ఉన్న నేతలు చెబుతున్నారు. స్థానిక నేతలను సంప్రదించకుండానే ఎవరిని పడితే వారిని చేర్చుకోవడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై పాత బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. భూ ఆక్రమలు సహా పలు తీవ్రమైన కేసులున్న తాడూరిని పార్టీలో ఎలా చేర్చుకున్నారని కొందరు నేతలు.. పార్టీ పెద్దలను నిలదీశారని తెలుస్తోంది. ఈ విషయం పార్టీ చీఫ్ బండి సంజయ్ దృష్టికి కూడా వెళ్లిందంటున్నారు. తాడూరి ఘటన పార్టీలో విభేదాలకు కారణం కాగా.. అదే తరహాలో ఇతర మండలాల్లోనూ చేరికలు జరిగాయంటున్నారు. స్థానికులతో సంబంధం లేకుండానే ఈటల రాజేందర్ చేరికలు చేపట్టడం వల్లే సమస్య వస్తుందంటున్నారు మునుగోడు కమలం లీడర్లు.
మునుగోడు బీజేపీలో కొత్త, పాత లీడర్ల మధ్య అసలే పొసగడం లేదని తెలుస్తోంది. మునుగోడు బీజేపీ ఇంచార్జ్ గా ఉన్నారు పార్టీ సీనియర్ నేత గంగడి మనోహర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన బండి సంజయ్ పాదయాత్రను పర్యవేక్షిస్తున్నారు. అయితే తన సొంత నియోజకవర్గంలో రాజకీయ వేడ కొనసాగుతున్నా.. గంగిడి మనోహర్ రెడ్డి అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నేతలు మునుగోడుకు వస్తున్నా.. స్థానిక నేత గంగడి ఎందుకు దూరంగా ఉంటున్నారన్నది చర్చగా మారింది. అంతేకాదు బీజేపీలో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంతవరకు గంగడి మనోహర్ రెడ్డిని కలవలేదు. అటు గంగడి కూడా రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి విషయంలో గంగిడి అసంతృప్తిగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలోని గంగిడి అనచరులు కూడా రాజగోపాల్ రెడ్డికి మనస్పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ పర్యటనల్లోనూ కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన నేతలే హడావుడే తప్ప.. పాత నేతలు ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. రాజగోపాల్ రెడ్డి అధికారికంగా పార్టీలో చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన మునుగోడు కమలం కేడర్ లో వ్యక్తమవుతోంది. పాత, కొత్త నేతలు కలిసి పని చేస్తారా లేక బీజేపీకి మొదటికే మోసం వస్తుందా అన్న అనుమానాలు కూడా కొందరు కమలం నేతల నుంచి వినిపిస్తోంది.
Read Also: TRS Warning: బండి సంజయ్ నాలుక చీరేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం
Read Also: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి