సింగరేణి ప్రాంతంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం శ్రీ కేసీఆర్ నేడు సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో జరిగినే ఈ భేటీకి సింగరేణి సీఎండీ శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా సమకూరిన ఆదాయం నుంచి.. డిస్ట్రిక్ట్ మినిరల్ ఫండ్ ట్రస్టు నిధులతో పాటు ఇతర నిధులతో రహదారులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సింగరేణి గనుల ద్వారా ఎంతో విలువైన ఖనిజ సంపద బయటకు వస్తుంది. అది జాతి అభివృద్ధికి దొహదపడుతుంది. కానీ ఇదే సమయంలో బొగ్గు గనులున్న ప్రాంతాలు మాత్రం ఛిద్రమైపోతున్నాయన్నారు.


కేవలం బొగ్గు గనులున్న ప్రాంతాలే కాకుండా బొగ్గు తరలించే మార్గాల్లోనూ రోడ్లు బాగా దెబ్బతింటున్నాయని.. దుమ్ము వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. బొగ్గు గనులున్న ప్రాంతాలు, వాటి ప్రభావం కలిగిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 


సింగరేణి గనులున్న గ్రామాలన్నీ మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలే అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అరకొరగానే ఉంటాయి. కావునా ఈ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతోనే జిల్లాల పునర్విభజన సందర్భంగా కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులు కల్పించాలన్నారు.