కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న జేడీఎస్ పార్టీ గుణగణాలన్నీ తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ మాదిరిగానే చాలా తక్కువ సీట్లు తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని.. ఇక్కడ కూడా అతి పెద్ద పార్టీగా బీజేపీయే చక్రం తిప్పుతుందని ఆయన జోస్యం చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలో జేడీఎస్ అవలంబించిన కుయుక్తులను సమర్థించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విలువను తగ్గించుకున్నారని లక్ష్మణ్ అన్నారు. ఈ విషయాన్ని బట్టి కేసీఆర్ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారని తెలిపారు. కాకపోతే తెలంగాణలో కచ్చితంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. 


కర్ణాటకకు చెందిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తీసుకొచ్చి హోటల్‌లో పెట్టినప్పుడు.. అందుకు సహకరించిన వారి జాబితాలో ఏ టీఆర్‌ఎస్ నేత పేరు ఉందో ఆ పార్టీ బహిర్గతం చేస్తే బాగుంటుందని కూడా లక్ష్మణ్ అన్నారు. అలాగే ఫ్లోర్ టెస్టుకి ముందే యడ్యూరప్ప రాజీనామా చేసి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చారని.. అలాంటి గౌరవ మర్యాదలు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎక్కడ ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.