TRS MLAs Poaching Case: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో సింహ యాజి స్వామికి తిరుపతి నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన శ్రీనివాస్ ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రశ్నించింది. ఎనిమిది గంటల పాటు శ్రీనివాస్‌ను విచారించిన సిట్ అధికారులు.. అసలు సింహ యాజి స్వామికి టికెట్ బుక్ చేయాల్సిన అవసరం ఏంటని ఆరా తీసింది. అక్టోబర్ 26వ తేదీన తిరుపతి నుండి హైదరాబాద్‌కు సింహ యజీ స్వామికి టికెట్స్ బుక్ చేయడం వెనుకున్న కారణాలను, అవసరాలను సిట్ రాబట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీనివాస్ కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్‌లను అతడి ముందు ఉంచి ప్రశ్నించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. ఎవ్వరు చెబితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసారని అడిగింది. సింహ యాజీ స్వామితో పూజ చేయించడానికి మాత్రమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశామని అంతకు మించి తనకు మరేమి తెలియదని శ్రీనివాస్ సిట్ అధికారులకు తెలిపాడు సింహ యాజీతో హోమం చేయించడంతో పాటు ఇంకొన్ని పూజలు జరిపించాలనే ఉద్దేశంతో సింహ యాజీని హైదరాబాద్‌కి పిలిచామని అన్నారు.


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు. 8 గంటల పాటు విచారించిన అనంతరం శ్రీనివాస్ మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుండి పంపించేశారు.


ఇదిలావుంటే, బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. వారు విచారణకు రాలేదు. దీంతో వారిపై తదుపరి చర్యలకుగాను సిట్ అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. మంగళవారం హైకోర్టు విచారణ అనంతరం విచారణకు రాని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.