ఆర్టీసీ సమ్మెపై కేకే సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మెపై కేకే కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో పరిస్థితులు చేజారుతున్నాయని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య కేకే వారధిగా నిలిచి చర్చలు జరుపుతారా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంతో తాను చర్చలు జరుపుతానని చెప్పలేదన్నారు. మంచి జరుగుతుందని అనుకుంటేనే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని కేకే స్పష్టంచేశారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదని చెబుతూ తాను ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. ప్రభుత్వం ఉద్దేశమేంటో తనకు తెలియనప్పుడు... తాను ఎలా చర్చలు జరపగలను అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన కేకే.. ఏదేమైనా ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా ఐక్యమత్యంతో వ్యవహరించాలని సూచించారు.
Related news : ఆర్టీసి కార్మికుల డిమాండ్లలో ఆ ఒక్కటి తప్ప: టీఆర్ఎస్ ఎంపీ కేకే
సోమవారం కేకే రాసిన లేఖతో ఆయన ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్య చర్చలకు వారధిగా నిలుస్తారా అనే అభిప్రాయాలు వినిపించాయి. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసి నేత అశ్వత్థామ రెడ్డి సైతం కేకే లేఖపై స్పందిస్తూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో కృషిచేసిన కేకే అంటే తమకు ఎంతో గౌరవమని.. ఆయన చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Related news : కేకే మధ్యవర్తిత్వంపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి