ఆర్టీసి కార్మికుల డిమాండ్లలో ఆ ఒక్కటి తప్ప: టీఆర్ఎస్ ఎంపీ కేకే

ఆర్టీసి కార్మికుల డిమాండ్లలో ఆ ఒక్కటి తప్ప: టీఆర్ఎస్ ఎంపీ కేకే

Updated: Oct 14, 2019, 05:54 PM IST
ఆర్టీసి కార్మికుల డిమాండ్లలో ఆ ఒక్కటి తప్ప: టీఆర్ఎస్ ఎంపీ కేకే
టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఫైల్ ఫోటో

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవ రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్యలు చేసుకుంటే ఏ సమస్య పరిష్కారం కాబోదన్నారు. ఇకనైనా పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికుల సమ్మెను విరమింపజేసి చర్చలకు రావాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించాలని సూచించారు. ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలపై స్పందిస్తూ సోమవారం కేకే ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా గతంలో ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్న కేకే.. అంతకుముందెప్పుడూ లేనివిధంగా వారికి 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆరెఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందిస్తున్నానని చెప్పిన కేకే.. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలి అని అభిప్రాయపడ్డారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా టిఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉంది తానేనని గుర్తుచేసిన కేకే.. ''ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు'' అని స్పష్టంచేశారు. ఆమాటకొస్తే.. ''ఆర్టీసీనే కాదు మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొనలేదు'' అని తేల్చిచెప్పారు.