హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష బుధవారం నుంచి ప్రారంభంకానుంది. మే 7వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 6వ తేదీ ఆదివారం రోజు పరీక్ష ఉండదు. ఎంసెట్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పరీక్ష నిర్వహణ అధికారులు తెలిపారు. నిముషం ఆలస్యమైనా పరీక్ష హాలులోనికి అనుమతించరు. తొలిసారిగా ఎంసెట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తుండటంతో ఎక్కడా కూడా సమస్యలు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 నగరాల్లో 168 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మొదటి బ్యాచ్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో బ్యాచ్‌ నిర్వహించనున్నారు.


ఎంసెట్ కన్వీనర్ యాదయ్య మాట్లాడుతూ, ఈ ఏడాది 1,47,958 మంది అభ్యర్థులు ఇంజనీరింగ్ ప్రవేశానికి, 73,106 అభ్యర్థులు మెడిసిన్ ప్రవేశానికి దరఖాస్తు చేస్తున్నట్లు చెప్పారు. జేఎన్టీయూ-హైదరరాబాద్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తీసుకుంది. మే 2, మే 3వ తేదీల్లో మెడిసిన్, అగ్రికల్చర్ ప్రవేశానికి.. మే 4, మే 5, మే 7వ తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు రెండు గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని కన్వీనర్ కోరారు.