తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్దమైన వేళ.. ఈసీ దూకుడును పెంచింది. అక్టోబర్ 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు సోమవారం నాడు ఢిల్లీ వెళుతుండగా, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సీఈసీకి కీలక నివేదిక ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యుటీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌హెచ్‌ ఉమేష్‌ సిన్హా నేతృత్వంలోని అధికారుల బృందం పర్యటించనుంది.


తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ కొత్త షెడ్యూల్ ప్రకారం, ఇవాళ (సెప్టెంబర్ 10) ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10న ముసాయిదా విడుదల చేసి 25వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి తగు నోటీసులిచ్చి అక్టోబరు 4వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే నెల 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసులో ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఓటర్ల జాబితా సవరణ, ఇతర ఏర్పాట్లపై చర్చలు నిర్వహించనున్నారు.


ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 1, 2019న 18 సంవత్సరాలు పూర్తయిన కొత్త ఓటర్లు వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హులు.


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. దాంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. తెలంగాణలో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది.