తెలంగాణ ఇంటర్ బోర్డులో మరో కలకలం.. ఆందోళనలో విద్యార్థులు!
ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు, విమర్శలు ఇంకా సద్దుమణగకముందే తాజాగా వరంగల్‌లో చోటుచేసుకున్న మరో ఘటన ఇంటర్ బోర్డుని మరోసారి విమర్శలపాలుచేసింది.
వరంగల్ అర్బన్ : తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల భవిష్యత్ పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందంటూ ఇటీవల ఎన్ని విమర్శలు వెల్లువెత్తాయో అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు, విమర్శలు ఇంకా సద్దుమణగకముందే తాజాగా వరంగల్‌లో చోటుచేసుకున్న మరో ఘటన ఇంటర్ బోర్డుని మరోసారి విమర్శలపాలుచేసింది.
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పేపర్లు మాయమవ్వడం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కస్టోడియన్ తనిఖీల్లో రెండు బాక్సులు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించడం సంచలనం సృష్టించింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో వున్న రెండు సీల్డ్ బాక్సులు ఎలా మాయమయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పదవ తరగతి అడ్వాన్స్ పరీక్షా పత్రాల బాక్సుల తాళాలు పగులగొట్టి మరీ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పేపర్లు అదృశ్యమైన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే అనేక ఆరోపణలు, విమర్శలతో పతాకశీర్షికలకు ఎక్కిన తెలంగాణ ఇంటరో బోర్డ్ తాగా ఘటనపై ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.