హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ ఉద్యోగులపై ఇటీవల పలు వరాలు గుప్పించిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా వారికి క్రిస్మస్ పర్వదినం నాడే మరో గుడ్ న్యూస్ వినిపించారు. ఆర్టీసీ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇదివరకే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఉండగా తాజాగా బుధవారం నాడు సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంపు ప్రకటన ఇక అధికారికంగా అమలులోకి వచ్చినట్టయింది. 


సర్కార్ ఉత్తర్వుల ప్రకారం ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తించనుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్... ఆ మేరకే తాజాగా ఉత్తర్వులపై సంతకం చేశారు. సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.