దూర ప్రాంత ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు, నగరాల నుంచి గ్రామాలకు వెళ్లేవారి కోసం లింక్ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక ప్రయాణీకుడు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న ప్రాంతం వరకు లింక్ టికెట్‌ను రిజర్వ్ చేసుకుంటే.. అదే టికెట్‌పై గ్రామానికి కూడా వెళ్లిపోవచ్చు.


ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్ వరకు లింక్‌ టికెట్‌ను రిజర్వ్‌ చేసుకుని అక్కడికి చేరుకున్నాక... తిరిగి అదిలాబాద్ నుంచి ఏదేని గ్రామానికి ఇతర బస్సుల్లో వెళ్లాలంటే ఇదే టికెట్‌ పని చేస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల ప్రయాణానికి నామమాత్రపు ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తారు. ఈ కొత్త సౌకర్యాన్ని జూన్‌ 2న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. ప్రయాణీకులు లింక్ టికెట్లను www.tsrtconline.in అనే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని..టికెట్ బుక్ అయ్యాక ప్రయాణీకుడి ఫోన్‌కి సర్వీస్ టికెట్, లింక్ టికెట్ మెసేజ్ వెళ్తుందని చెప్పారు.