September 17th: తెలంగాణలో 17న ఏం జరగబోతోంది..? కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ కీలక ప్రకటనలు..!
September 17th: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 చుట్టూ పాలిటిక్స్ సాగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
September 17th: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిపాటు ఉత్సవాలు జరపనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సెప్టెబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. ఉత్సవాల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను సైతం రావాలని ఆహ్వానం పలికారు.
ఈకార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని..వారికి లేఖలు పంపినట్లు వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ప్రాంతం ఇండియాలో కలుస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటకలోకి వెళ్లాయని గుర్తు చేశారు. అందుకే వారిని ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.
ఇందులోభాగంగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని యోచిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని..పవర్‌లోకి రాగానే విస్మరించారని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు సెప్టెంబర్ 17పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అదే రోజు హైదరాబాద్ పాతబస్తీలో తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం..భారత్‌లో విలీనం అయ్యిందని గుర్తు చేశారు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని..అలాకాకుండా జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇందులోభాగంగానే కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్‌కు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని తెలిపారు. తురేబాజ్‌ఖాణ్ వీరోచిత పోరాటం చేశారని స్పష్టం చేశారు.
పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామ్నారు అసదుద్దీన్ ఓవైసీ. అనంతరం ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని..పార్టీ ఎమ్మెల్యేలంతా ఇందులో పాల్గొంటారని తెలిపారు. మొత్తంగా సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విపక్షాలకు చెక్ పెట్టేలా నిర్ణయం ఉండే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
Also read:Asia Cup 2022: రేపే భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్..తుది జట్లు ఇదిగో..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి