KTR vs Revanth: మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ జీవితం లేకుండా చేస్తాం: కేటీఆర్ హెచ్చరిక
KT Rama Rao Meets Patnam Narender Reddy In Cherlapally Prison: నయా నియంతలాగా రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడ్డదని.. అతడు కొట్టుకుపోయే పరిస్థితి తొందరలోనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అతడికి రాజకీయ జీవితం లేకుండా చేస్తామని హెచ్చరించారు.
Cherlapally Central Jail: సొంత నియోజకవర్గం కొడంగల్.. సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి, అతడి సోదరులు రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదు' అని స్పష్టం చేశారు. 'నువ్వు నియంత కాదు. నువ్వు చక్రవర్తి కాదు. నీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకుపోయారు. నువ్వు కూడా కొట్టుకుపోతావ్' అంటూ విరుచుకుపడ్డారు.
ఇది చదవండి: KTR Election Results: చాపర్లు.. బ్యాగులు మోసినా ఘోర వైఫల్యం.. ఇకనైనా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకో
కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో రైతుల ఆందోళనలో కుట్రపూరితంగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని శనివారం కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ బృందం కలిసింది. ములాఖత్‌లో నరేందర్ రెడ్డితో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనపై మండిపడ్డారు.
'రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా చేయని తప్పునకు నరేందర్ రెడ్డి జైలులో ఉన్నారు. కొడంగల్‌లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్‌ను రుద్దుతున్నారు' అని కేటీఆర్ తెలిపారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. 'కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారు' అని రేవంత్ రెడ్డి సోదరులపై మండిపడ్డారు.
'కొడంగల్‌లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు.. పిల్లలపై అరాచకాలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డిని వేధించి క్షోభపెట్టడంతో అవమానంగా భావించి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. 'గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా?' అని ప్రశ్నించారు.
సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చావా? అని కేటీఆర్ నిలదీశారు. 'శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారు' అని తెలిపారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. మీ వెంట కేసీఆర్ ఉన్నాడని కేటీఆర్ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter