Rajbhavn Vs Pragathi bhavan: గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్.. అసలేం జరిగింది..? జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజుకున్న ఈ చిచ్చు ఇంకా సమసిపోలేదు. ఉగాది ఉత్సవాలతో మరింత బహిరంగమయ్యింది. గవర్నర్ మరియు గవర్నమెంట్ మధ్య అసలేం జరిగింది.. దీనిపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ!
Rajbhavn Vs Pragathi Bhavan: తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజుకున్న ఈ చిచ్చు ఇంకా సమసిపోలేదు. ఉగాది ఉత్సవాలతో మరింత బహిరంగమయ్యింది. ఇదే సమయంలో హస్తినలో కేసీఆర్ ఉన్నప్పుడే గవర్నర్ తమిళిసైకి పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అక్కడ తమిళిసై గళం విప్పడం ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు.. తాను తలచుకుంటే తెలంగాణ ప్రభుత్వం కూలిపోయేదని, కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్కారును కూల్చడం తనకు ఇష్టం లేదన్నారు. దీంతో, ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి.. ఒక్కసారిగా బహిర్గతమయ్యంది. ఫలితంగా తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. తెలంగాణ పంచాయతీ హస్తినకు చేరింది. చూపులన్నీ హైదరాబాద్ నుంచి హస్తినవైపు మరలాయి. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్ రాజకీయభవన్‌లా మారిందని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మరో పరిణామం ప్రభుత్వం గవర్నర్ పట్ల చూపిస్తున్న వివక్ష ఇంకా కొనసాగుతుందన్న దానికి నిదర్శనంగా నిలిచింది.
గవర్నర్ తమిళిసైకి అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా వెళ్లిన గవర్నర్‌కు ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయలేదు. దీంతో, కొత్తగూడెం దాకా గవర్నర్ రైలులో ప్రయాణించారు. స్వాగతం పలికేందుకు కనీసం కలెక్టర్ స్వాగతం పలకలేదు. అక్కడినుంచి తమిళిసై.. రోడ్డుమార్గంలో భద్రాచలం వెళ్లారు. అక్కడ కూడా కీలక అధికారులు సెలవులో వెళ్లడం గవర్నర్‌కు ప్రొటోకాల్ ఉల్లంఘించడమే అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు గడిచిన వారం ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావాలంటూ హోంశాఖ నుంచి సమాచారం వచ్చింది. దీంతో, హుటాహుటిన గవర్నర్ తమిళిసై హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఈ పరిణామం హాట్ టాపిక్ అయ్యింది.
వాస్తవానికి గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లడానికి రెండు రోజుల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కుటుంబ సభ్యులందరితో కలిసి హస్తినకు బయలుదేరి వెళ్లారు. సోమవారం వరకు ఢిల్లీలోనే ఉండి.. కేంద్రంపై నిరసన దీక్షలో పాల్గొని.. కేసీఆర్ తిరిగొచ్చారు. ఇప్పటికే కేంద్రంపై కేసీఆర్ ఓరకంగా యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లు వ్యవహారంలో కేంద్రం తీరుపై నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరి.. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సమయంలోనే గవర్నర్ తమిళిసైకి కూడా కేంద్రం నుంచి పిలుపురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన నివేదికను హోంశాఖకు సమర్పించారు. ఈ రిపోర్ట్ కీలకంగా మారింది. రాష్ట్రంలోని పరిణామాలపై గవర్నర్ హోంశాఖకు నివేదిక ఇవ్వడం సాధారణంగా జరిగే ప్రాసెస్ అయినప్పటికీ.. తెలంగాణలో కొంతకాలంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ టూర్ హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం.. రాజ్యాంగ పదవి అయిన గవర్నర్ విషయంలో ప్రొటోకాల్ వివాదాలను ప్రధానంగా హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. తమిళిసై గవర్నర్‌గా వచ్చిన మొదట్లో తెలంగాణ ప్రభుత్వంతో రాజ్‌భవన్‌కు మంచి సంబంధాలు ఉండేవి. అయితే, క్రమంగా రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఎంతలా అంటే.. కనీసం గవర్నర్‌కు ప్రొటోకాల్ కూడా పాటించనంతగా పెరిగిపోయింది. గవర్నర్ మేడారం పర్యటనకు వెళ్లినప్పుడు ప్రభుత్వ అధికారులెవరూ హాజరు కాకపోవడం, కనీసం స్వాగతం కూడా పలకకపోవడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తొలగించడం తెలంగాణ సర్కారు వైఖరిపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. ఉగాది పర్వదినం రోజు గవర్నర్ యాదాద్రి పర్యటనకు వెళ్లినప్పుడు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, చివరకు ఆలయ ఈవో కూడా గైర్హాజరు కావడం ప్రొటోకాల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్‌భవన్‌ను అవమానిస్తోందన్న వాదనలకు బలం చేకూరింది. ఇక, మరిన్ని పరిణామాలు చూస్తే.. యాదాద్రి ఆలయం ఉద్ఘాటనం కార్యక్రమానికి గవర్నర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఇక, ఉగాదికి ముందు రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం వెళ్లినా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. ఇక, మరుసటిరోజు ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం అందలేదు.
ఈ పరిణామాలు గవర్నర్‌కు ఇబ్బందికరంగా పరిణమించాయి. మహిళా గవర్నర్ అయినందుకే కేసీఆర్ ప్రభుత్వం ఇలా వివక్ష చూపిస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి. అయినా కేసీఆర్ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో, ఉగాది పర్వదిన వేడుకల్లో స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. తన పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బహిరంగంగా ప్రస్తావించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించినా.. ఉగాది ఉత్సవాల్లో మాత్రం కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. తాను ఆహ్వానం పంపినా రాలేదని, కానీ, తనకు ఆహ్వానం వస్తే మాత్రం ప్రగతి భవన్‌కు వెళ్తానని కుండబద్దలు కొట్టారు. అయినా ప్రగతిభవన్ ఉగాది వేడుకలకు రాజ్‌భవన్‌కు ఆహ్వానం అందకపోవడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రోటోకాల్ వివాదాలు అధికారికంగా నివేదిక రూపంలో కేంద్ర హోంశాఖకు గవర్నర్ సమర్పించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు.. హోంమంత్రి అమిత్‌షాతో తమిళిసై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా ముందు తన ఆవేదనను వెల్లగక్కారు. ఓ రకంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన పట్ల వివక్షను ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని సూచించారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ..ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించానన్న గవర్నర్.. చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు కూడా చేశానన్నారు.
అంతేకాదు.. తెలంగాణ సర్కారు లొసుగులను కూడా తమిళిసై ఎత్తిచూపారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ ఆస్పత్రిలో వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. తాను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలని నేరుగా సవాల్ విసిరారు. సీఎం ఏ విషయం పై అయినా తనతో నేరుగా వచ్చి చర్చించవచ్చన్నారు గవర్నర్. ఇక, రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయంకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి మీడియాకు కూడా తెలిసిందే అని తమిళిసై ప్రస్తావించారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని.. అందరితోనూ స్నేహంగానే ఉంటానని స్పష్టం చేశారు. అంతేకాదు.. తాను చాలా పారదర్శకంగా ఉంటానని, ప్రజలతో, ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటానన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో వారికే తెలియాలన్నారు. కనీసం గవర్నర్ పదవిని, కార్యాలయాన్ని గౌరవించాలని హితవు పలికారు. అయినా, తాను వేటినీ పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ తాను వివాదం చేయలేదని, దేనిపై అయినా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. తన పర్యటనల్లో అధికారులను సైతం హాజరు కాకుండా, ప్రోటోకాల్ అమలు చేయకుండా చేయడం సరైన చర్యేనా? అని నిలదశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్న తమిళిసై.. గవర్నర్‌గా ఎవరన్నా సరే, ఆ పదవిని గౌరవించాలని సూచించారు.
Also Read: Covid 19: పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు
Also Read: Pawan Kalyan News: అనంతపురంలో 'కౌలు రైతు భరోసా యాత్ర'.. రైతు కుటుంబాలను పవన్ ఆర్థిక సాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook