హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీయడమేకాకుండా కత్తితో దాడికి పాల్పడే వరకు వెళ్లింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన అనురాధ (40) అనే మహిళ చాంద్రాయణగుట్టలోని ఏజీ గార్డ్స్ వద్ద బస్సు ఎక్కారు. బస్సులో మహిళల సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తిని లేచి సీటు ఇవ్వాల్సిందిగా కోరగా.. అతడు ఆమెతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న అనురాధ అతడి చెంప చెళ్లుమనిపించారు. అనురాధ తనపై చేయి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని అతడు వెంటనే తన వద్ద ఉన్న సంచిలోంచి పదునైన కత్తిని తీసి పొడిచాడు. కత్తి బాగా పదునుగా ఉండటంతో అనురాధకు భారీ గాయమైంది.   యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన అనురాధ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. 


ఇదిలావుంటే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనురాధపై దాడికి పాల్పడిన అనంతరం బేగంబజార్ వద్ద బస్సు దిగి పారిపోయిన నిందితుడి కోసం ప్రస్తుతం బేగంబజార్ పోలీసులు గాలిస్తున్నారు. అతడు బస్సు దిగిపోయిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అతడు ఎవరు, ఎక్కడికెళ్లాడు అనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..