శనివారం నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు 11 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 23వ తేదీన బాలాలయంలో స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 24న యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవం జరగనుంది. కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్‌ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజు గవర్నర్ నరసింహన్ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఈ నెల 25న యాదాద్రి స్వామివారి రథోత్సవం జరగనుంది.


ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాటు పూర్తిచేశారు. కొండపై ప్రత్యేక క్యూలైన్లు, వికలాంగులకు, వీఐపీలకు, సామాన్య భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా రోజూ వెయ్యి మందికి, ముఖ్యమైన మూడు రోజుల్లో పదిహేను వందల మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.