Yennam Srinivas Reddy Suspended From BJP: తెలంగాణలో బీజేపి మరో నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. " మాజీ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నందున ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ బీజేపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది " అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్షణం నుండే పార్టీ నిర్ణయం అమలులోకి వస్తుంది అని ప్రేమేందర్ రెడ్డి స్పష్టంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కాలంలో బీజేపి నుండి సస్పెన్షన్ కి గురైన వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి నెంబర్ రెండవది. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడంపై అప్పటి వరకు ఆ పార్టీలో కొనసాగిన జిట్టా బాలకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జిట్టా బాలకృష్ణా రెడ్డి.. కిషన్ రెడ్డి ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు కాకపోగా.. పైగా బీఆర్ఎస్ పార్టీతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయని.. అలాంటి వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వడం ఏంటంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత ఒకట్రెండు రోజులకే జిట్టా బాలకృష్ణా రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు.


ఇదిలావుంటే, తాజాగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని గత కొన్ని నెలలుగా ఓ టాక్ నడుస్తోంది. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ సైతం వీరికి టికెట్స్ ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి అని వార్తలొస్తున్నాయి. 


మహబూబ్ నగర్ నుండి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఢీకొట్టాలంటే.. అక్కడ స్థానికంగా ఉన్న గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి.. అందుకోసం మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డినే ఎంచుకుంటున్నారు అనేది ఆ వార్తల సారాంశం. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే వార్తల నేపథ్యంలోనే బీజేపి ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేసినంత మాత్రాన్నే ఆయనతో పాటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్న ఇంకొంతమంది నేతలు వెనక్కి తగ్గుతారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.