YS Sharmila Complaint To Governor Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే ఉద్దేశ పూర్వంగానే తమపై దాడి జరిగిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసైను కలిసిన షర్మిల.. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్నిరోజులుగా ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఫ్లెక్సీలు తగలబెట్టి, బస్సులు కాలబెట్టి, కార్యకర్తలను కొట్టి, వాహనాలను ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. ఈ మొత్తం విధానాన్ని రాష్ట్ర గవర్నర్‌కు వివరించామని చెప్పారు. పోలీసులు తమపై దాడి చేసిన టీఆర్ఎస్ గూండాలను వదిలిపెట్టి.. తమను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. 3500 కిలోమీటర్ల పాదయాత్రతో తమకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని అన్నారు.


"కేసీఆర్ పతనం మొదలైంది కాబట్టే.. కేసీఆర్ సర్వేలో మా పార్టీకి ఆదరణ పెరిగిందుకే దాడులు. నన్ను అరెస్ట్ చేయడానికి కేసీఆర్ ముందే ప్లాన్ వేశారు.
లా అండ్ ఆర్డర్ సమస్య పుట్టించింది పోలీసులు, టీఆర్ఎస్ గూండాలే.. టీఆర్ఎస్ గూండాల దాడులను కేసీఆర్‌కు చూపేందుకే ప్రగతిభవన్‌కు వెళ్లాం.. కేసీఆర్ ఇంటికి చేరుకోకముందే పోలీసులు ఓవరాక్షన్ చేసి అడ్డుకున్నారు. మేం ఒక లైన్ లో వెళ్తున్నా.. పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టి ట్రాఫిక్ సమస్య సృష్టించారు. వాహనంలో ఉండగానే ఒక మహిళ అని చూడకుండా క్రేన్ సాయంతో మమల్ని తీసుకెళ్లారు. మా మనుషులను అరెస్ట్ చేసి, తీవ్రంగా కొట్టారు. పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడిది..?" అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.


తెలంగాణలో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన కాదు.. దొరల పాలన అని ఆమె అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పాదయాత్రలో కేసీఆర్ మోసాలను నిలదీస్తూ.. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తుంటే కేసీఆర్ ఓర్వడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు.


"కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్‌లో దోచుకుంది.. కొడుకు కేటీఆర్ బినామీల పేరుతో లక్షల కోట్లు సంపాదించారు.. రైడ్లు చేస్తే కేసీఆర్ కుటుంబం, ప్రగతి భవన్ మీద చేయాలి.. లక్షల కోట్లు బయటపడుతాయి.. ఉద్యమకారుడు కదా అని అధికారం ఇస్తే మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. మోసాలను ఎండగడితే రెచ్చగొట్టినట్టా..? ఇదేం దిక్కుమాలిన ఆరోపణ..? మీ కేసీఆర్ తిట్లతో పోలిస్తే మాది ఎంత..? ఒక మంత్రి నన్ను మరదలు అంటేనే.. చెప్పుతో కొడతా అని అన్నాను. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమి అనలేదు. ఆయన మగతనంతో నాకేం పని. 


మీ చెల్లినో, తల్లినో మరదలు అంటే మీరు ఊరుకుంటారా..? పాదయాత్రలో ఎక్కడ తిరిగినా... ఎమ్మెల్యేలంతా డబ్బులు సంపాదించుకోవడం తప్ప.. సేవ చేయడం లేదని అంటున్నారు. నన్ను ఆంధ్రా పెత్తనం ఏందని అంటున్నారు. కేటీఆర్ భార్య ఆంధ్రా నుంచి రాలేదా..? ఇక్కడ బతకడం లేదా..? కేటీఆర్ భార్యను మీరు గౌరవించుకున్నప్పుడు, నన్ను ఎందుకు గౌరవించరు..? నేను ఇక్కడ పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. అబిడ్స్ లో స్కూలుకు పోయాను. మెహిదీపట్నంలో కాలేజీకి పోయాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే నా కొడుకును కన్నాను. కూతుర్ని కన్నాను. ఇక్కడి ప్రజలకు సేవ చేయడం నా హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. ముమ్మాటికీ నేను తెలంగాణ బిడ్డనే. తెలంగాణ ఆడపడుచునే.." అని వైఎస్ షర్మిల అన్నారు. 


రేపటి నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు ఆమె తెలిపారు. తమపై దాడులు తప్పవని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారని.. దాడులు చేయాలనుకునే వారిని ముందే అదుపులోకి తీసుకుని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. తమకు, తమ మనుషులకు ఏమైనా జరిగితే దీని పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. తెలంగాణ అఫ్గనిస్తాన్‌గా మారిందని.. కేసీఆర్ తాలిబన్ అధ్యక్షుడిగా మారాడని విమర్శించారు.