భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన కేరళ బాధితులకు అండగా నిలిచేందుకు తమ వంతు సహాయంగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ రూ.7 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఆ మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేయనున్నట్టు యాపిల్ స్పష్టంచేసింది. కేరళ వరదలు తమను తీవ్రంగా కలచివేశాయని ఈ సందర్భంగా యాపిల్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. యాపిల్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్‌లలో విరాళాలు కోరుతూ యాపిల్ తమ హోమ్‌పేజీలో బ్యానర్‌ను ఏర్పాటు చేసింది. 


ఐట్యూన్స్, యాప్ స్టోర్‌లో ఉన్న డొనేట్ బటన్ ద్వారా యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులు కేరళకు విరాళాలు అందచేసే విధంగా యాపిల్ సంస్థ ఏర్పాట్లు చేసింది. కేరళకు విరాళం ప్రకటించాలనుకునే దాతలు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా 5, 10, 25, 50, 100 లేదా 200 డాలర్లు డొనేట్ చేయవచ్చని యాపిల్ ఈ ప్రకటనలో పేర్కొంది.