మైనార్టీల అంశంపై పాక్ ప్రధానికి అసదుద్దీన్ దిమ్మదిరిగే కౌంటర్
హైదరాబాద్: మైనార్టీల అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలపై అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. మైనార్టీ విషయంలో ఎలా మెలగాలో తమ దేశం నేర్చోవాల్సిన పనిలేదని.. పాకిస్తాన్ దేశమే భారత్ ను చూసి నేర్చుకోవాలని ఆయన ఇమ్రాన్ ఖాన్ కు హితవు పలికారు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం కేవలం ముస్లింలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టడానికి ఆస్కారం ఉందన్న ఒవైసీ ..దీనికి భిన్నంగా భారతదేశంలో అణగారిన వర్గాలకు చెందిన వారు కూడా రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వహించారని ట్వీట్ చేశారు.
లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో మైనార్టీల అంశాన్ని ప్రస్తావిస్తూ పాక్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ భారత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ దేశంలో అల్ప సంఖ్యాకుల హక్కులు అమలయ్యే విధంగా తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మైనారిటీల విషయంలో ఎలా నడుచుకోవాలో తన ప్రభుత్వం.. భారత ప్రభుత్వానికి మర్గదర్శకంగా ఉందని గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశంలో మైనారిటీలను సమాన హోదా కల పౌరులుగా పరిగణించడం లేదని చెబుతున్నారని అంటూ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మైనార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ భారత ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ఇలా ట్వీట్ చేశారు.