అమెరికాలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కాలిఫోర్నియాలోని పారడైజ్ నగరం కేవలం ఒక్క రోజులోనే బూడిదగా మారిపోయింది. 200 సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ పురాతన నగరం కార్చిచ్చుకి బలవ్వడంతో వేలాదిమంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు. సత్వరం హై ఎలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను వెనువెంటనే ఇండ్లను ఖాళీ చేయమని సూచించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని ఆదేశించింది. అలా తరలింపుకు సిద్ధమైన పురజనులు లక్షల్లో ఉన్నారని సమాచారం. పారడైజ్ నగరం హాలీవుడ్ ప్రముఖులకు పెట్టింది పేరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచి పర్యాటక నగరం కూడా. కార్చిచ్చు వల్ల దగ్ధమైన నగరాన్ని రక్షించడం కోసం కొన్ని వేల అగ్నిమాపక శకటాలు పారడైజ్ ప్రాంతానికి తరలివెళ్లాయి.  ప్రస్తుతం ఈ కార్చిచ్చు ధాటికి 23 మంది మరణించారు. చాలామంది గాయాలపాలయ్యారు. ఈ కార్చిచ్చు వల్ల 90 వేల ఎకరాల్లోని అడవులు నాశనమయ్యాయి. ఈ కార్చిచ్చును నియంత్రించడానికి వచ్చిన అగ్నిమాపకదళ అధికారుల్లో కూడా చాలామందికి గాయాలయ్యాయి. 


మలిబు వంటి ప్రఖ్యాత ప్రాంతాలలో కూడా ఈ కార్చిచ్చు వ్యాపించింది. ప్రముఖ సింగర్ లేడీ గాగా కూడా తన ఇంటిని ఖాళీ చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆస్కార్ డైరెక్టర్ గుల్లిర్మో డెల్ టోరో కూడా ఎంతో  ఇష్టపడి నిర్మించుకున్న మ్యూజియం బ్లీక్ హౌస్‌ను వదిలి వెళ్లిపోయారు. ఆయన స్టూడియో సెట్స్ కూడా ఈ కార్చిచ్చు మంటల్లో కాలిపోయాయని సమాచారం. ఈ కార్చిచ్చుకి తోడు గాలులు బలంగా వీయడంతో మంటలు 56 కిలోమీటర్ల వేగంతో ఎగసి ఎగసి పడుతున్నాయి. క్యాంప్ క్రీక్ ప్రాంతం వద్ద ప్రారంభమైన ఈ కార్చిచ్చు.. చికో పట్టణం వరకూ వ్యాపించింది. ప్రస్తుతం దాదాపు కొన్ని లక్షలమంది జనాలు తమ ప్రాణాలను కాపాడుకొనేందుకు తమ ఇండ్లను వదిలి రోడ్ల మీదకు వస్తున్నారు. మరో 24 గంటల్లో ఈ ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు చెబుతున్నారు.