బాత్ రూమ్‌లో మహిళను కాటేసిన 5 అడుగుల కొండచిలువ!
బాత్ రూమ్‌లో మహిళను కాటేసిన 5 అడుగుల కొండచిలువ!
బ్రిస్బేన్: కాలకృత్యాలు తీర్చుకుందామని టాయిలెట్ సీట్‌పై కూర్చున్న ఓ మహిళను 5 అడుగుల కొండచిలువ కాటేసిన ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బీబీసీ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. హెలెన్ రిచర్డ్స్ (59) అనే మహిళ బ్రిస్బేన్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. 'లైట్ వెలిగించకుండానే తాను వాష్ రూమ్‌లోకి వెళ్లానని, టాయిలెట్ సీట్‌పై కూర్చున్నప్పుడే పాము కాటేయడంతో చంగున ఎగిరి గంతేశాను' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారామె. ''ఎగిరి గంతేసిన వెంటనే ఏం జరిగిందా అని తిరిగి వెనక్కి చూడగా... అప్పుడే పాము తిరిగి వెనక్కి వెళ్లడం కనిపించింది'' అని సదరు మహిళ అక్కడి కొరియర్ మెయిల్ పత్రిక ప్రతినిధికి వెల్లడించారు. పాము కాటు అనంతరం చికిత్స తీసుకున్నట్టు ఆ మహిళ తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే పాములను పట్టే వారికి సమాచారం అందించగా వారు వచ్చి పామును పట్టుకున్నారు. వాతావరణం వేడిగా వున్నప్పుడు పాములు ఇలా టాయిలెట్స్‌లో దూరడం మామూలేనని, హెలెన్ ఆ ఘటనను ఓ ఛాంపియన్‌లా ఎదుర్కున్నారని ఆ పామును అందులోంచి రక్షించిన వ్యక్తి పేర్కొన్నారు. మహిళను కాటేసిన పాము విషపూరితమైన జాతికి సంబంధించినది కాదు అని తెలిపారు. ఇదిలావుంటే, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఇటీవలె ఇదే తరహాలో ఓ ఇంట్లోని టాయిలెట్‌లోకి కొండచిలువ ప్రవేశించిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.