ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అవినీతికి సంబంధించి ఆయనపై పలు కేసులు నమోదు చేయాలని ఆ దేశ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుల్లో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొనాలని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ మాగ్నెట్స్ నుండి భారీస్థాయిలో బహుమానాలను ఆయన పొందారనే ఆరోపణల మీద ఆయనపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ప్రపంచ స్థాయిలో గొప్ప నేతగా పేరు గడించిన నెతన్యాహు పై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్త పట్ల అంతర్జాతీయ రాజకీయాలలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు నెతన్యాహు నాలుగు సార్లు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయనపై ఇజ్రాయెల్‌లో కేసులు నమోదు చేయాలంటే ఆ దేశ అటార్నీ జనరల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 


అయితే తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని నెతన్యాహు గతంలో కూడా తెలిపారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో వస్తున్న మీడియా కథనాలపై ఆయన ఏమీ స్పందించలేదు. గత నెలే నెతన్యాహు భారత్ సందర్శించారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సబర్మతీ ఆశ్రమానికి వచ్చి బాపూజీకి నివాళులు కూడా అర్పించారు. ఇజ్రాయెల్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత నెతన్యాహుది. ఈ క్రమంలో ఆయన పై వస్తున్న అవినీతి ఆరోపణలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి.