అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఏకంగా ప్రాంక్ కాల్ చేశానని చెబుతున్నాడు ఆ దేశానికి చెందిన ప్రముఖ కమెడియన్ జాన్‌ మెలెండెజ్‌. అయితే అలా ప్రాంక్ కాల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం అని..  సెక్యూరిటీ కళ్లు కప్పి ఆ సాహసం చేయడమనేది అసలు ఊహించలేమని జాన్ పేర్కొన్నాడు. అమెరికాలో పాడ్‌క్యాస్ట్‌ వ్యాఖ్యాతగా సుపరిచితుడైన జాన్ ఈ మధ్యకాలంలో ఓ వాయిస్ రికార్డును విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అ రికార్డు ట్రంప్‌‌కి తాను చేసిన ప్రాంక్ కాల్‌కి సంబంధించిందని..  న్యూజెర్సీ సెనేటర్‌ బాబ్‌ మెండెజ్‌‌నని చెబుతూ తాను ఆ ప్రాంక్ కాల్ చేశానని జాన్ తెలిపాడు. అయితే ఆ రికార్డును విన్న అనేకమంది అమెరికన్లు.. అది అచ్చం ట్రంప్ వాయిస్ మాదిరిగానే ఉండడంతో ఆశ్చర్యపోతున్నారు. ఆ రికార్డులో ఇరువురూ పలు ఆసక్తికరమైన రాజకీయ విషయాలు కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా ట్రంప్ ఓదార్పుతో కూడిన మాటలు మాట్లాడుతూ "మీరు గతంలో చాలా కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నారు" అని ఆ కాల్‌లో చెప్పడం విశేషం. న్యూజెర్సీ సెనేటర్‌ బాబ్‌ మెండెజ్‌ గతంలో పలు అవినీతి కేసుల్లో చిక్కుకొని అనేక సమస్యలు ఎదుర్కొన్నారట. ఆ తర్వాత వాటి నుండి విముక్తి పొందారట. ట్రంప్ బహుశా ఆ అంశాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని కూడా పలువురు అంటున్నారు.


అయితే ఇంకా ఈ ప్రాంక్ కాల్ విషయంలో నిజనిజాలు తేలాల్సి ఉందని.. ప్రోటోకాల్ నియమాలు పాటించకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు వైట్ హూస్‌కి ఫోన్ చేసి మాట్లాడలేరని పలువురు అంటున్నారు. అయితే బయట ఈ ప్రాంక్ కాల్ విషయమై ఇంత రాద్దాంతం జరుగుతున్నా.. వైట్ హౌస్ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.