క్యూబాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విప్లవకారుడు చేగువేరా. అయితే తాజాగా ఆయనపై ఆరోపణలు చేస్తూ.. ఆయనను హంతకుడిగా పేర్కొంటూ పలువురు ఓ ఫోటోని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయసాగారు. ఆ ఫోటోలో వెనుక వైపు నుండి చేగువేరా మాదిరిగానే కనిపించే ఓ వ్యక్తి, ఇద్దరు అమ్మాయిలను కాల్చి చంపుతుండడం గమనార్హం. చేగువేరాని ఆరాధ్యదైవంగా భావించేవారు.. ఆయన ఓ హంతకుడని తెలుసుకోవాలని..ఇదే ఆయన నిజస్వరూపమని చెబుతూ ఆ ఫోటోని సర్క్యులేట్ చేస్తున్నవారు సందేశాన్ని కూడా పంపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చేగువేరా అనడానికి తగిన ఆధారాలు లేవని.. కేవలం ఆ విప్లవకారుడి పరువు తీయడానికి... ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేక భావనను తీసుకురావడానికే పలువురు ఆ ఫోటోని సర్క్యులేట్ చేస్తున్నారని పలువురు అంటున్నారు. కొందరు ఆ ఫోటో యుగోస్లేవియా యుద్ధానికి సంబంధించింది అంటే.. మరికొందరు సివిల్ వార్‌కి సంబంధించింది అంటున్నారు. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు..? అన్న విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. 


చేగువేరాకి ప్రపంచంలో అనేకచోట్ల విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను "చే" అని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. యుక్తవయసులోనే చేగువేరా లాటిన్ అమెరికా అంతా మోటార్ బైక్ మీద పర్యటించారు. ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం మరియు సామ్రాజ్యవాదాన్ని కట్టడి చేయాలంటే తిరుగుబాటు ఒక్కటే అసలైన పరిష్కారమని ఆయన భావించారు.


క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేసిన చేగువేరా... ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి ఆ దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత లాటిన్ అమెరికా, ఆఫ్రికన్‌ దేశాలకు కూడా తన సేవలు అవసరమని భావించిన చేగువేరా.. ఆ తర్వాత బొలీవియాలో కూడా విప్లవ పోరాటం చేశాడు. అదే దేశంలో గవర్నమెంటు మిలట్రీతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9 తేదిన చే మరణించాడు.