పాకిస్తాన్‌కి నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ నియమితులయ్యారు. తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్వీ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చాలా సన్నిహితమైన వ్యక్తి. పెద్దగా ఆడంబరాలు లేకుండానే ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి నివాసంలో పాకిస్తాన్ చీఫ్‌ జస్టిస్‌ చేతుల మీదుగా అల్వీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మమ్నూన్‌ హుస్సేన్‌ పదవీకాలం ముగియడంతో ఆయన పదవిలో అల్వీ నియమితులయ్యారు. ఇటీవలే పాకిస్తాన్ దేశాధ్యక్ష పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఆరిఫ్ అల్వీ.. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ అభ్యర్థి మౌలానా ఫజల్‌ ఉర్‌ రహమాన్‌‌ను ఓడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్‌లోని కరాచీలో పుట్టి పెరిగిన ఆరిఫ్ అల్వీ ఓ డెంటల్ డాక్టర్. ఆయన తండ్రి హబీబ్ ఉర్ రెహమాన్ కూడా దంతవైద్యుడే. జవహర్ లాల్ నెహ్రు, మహ్మద్ అలీ జిన్నా లాంటి నాయకులకు ఆయన వైద్యం కూడా చేశారట. పాకిస్తాన్‌లోని ప్రముఖ దంతవైద్యశాలల్లో ఒకటైన అల్వీ డెంటల్ ఆసుపత్రిని స్థాపించింది కూడా ఆరిఫ్ అల్వీయే కావడం విశేషం. అంతర్జాతీయంగా పేరున్న దంత వైద్యుల్లో అల్వీ కూడా ఒకరు. అయితే 1977లో జుల్ఫికర్ ఆలీ భుట్టో సాధారణ ఎన్నికలను ప్రకటించిన కాలం నుండీ కూడా రాజకీయ కార్యక్రమాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొనేవారు ఆరిఫ్ అలీ.


ఆయుబ్ ఖాన్ పాకిస్తాన్‌ను పాలిస్తున్న రోజుల్లో విప్లవకారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అల్వీ పోరాడారు. ఆయన పై రెండు సార్లు హత్యాయత్నం కూడా జరిగింది. ఇప్పటికీ ఓ బులెట్ ఆయన శరీరంలో ఉందని సమాచారం. తన పై హత్యా యత్నం జరిగాక కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న అల్వీ.. 1996లో ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులుగా కూడా వ్యవహరించారు. 2001లో పీటీఐ వైస్ ప్రెసిడెంటుగా కూడా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే పార్టీకి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం మళ్లీ అదే పార్టీ తరఫున అధ్యక్షుడి పదవికి పోటీ చేసి గెలుపొందారు.