జర్మనీ నియంత, నాజీల పార్టీ వ్యవస్థాపకుడు హిట్లర్ 1945లో ఆత్మహత్య చేసుకొని చనిపోలేదని.. ఆయన ఓడలో అర్జెంటీనా వెళ్లిపోయాడని.. ఆ తర్వాత అంటార్కిటికాలో మంచుకొండల మధ్య కొన్నాళ్లు తలదాచుకున్నాడని వచ్చిన కథనాలను ఫ్రెంచి శాస్త్రవేత్తలు కొందరు ఖండించారు. తాము ఈ విషయంపై చాలా పరిశోధనలు చేశామని.. ఆయన కచ్చితంగా 1945లోనే చనిపోయాడని వారు నిర్థారించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిట్లర్ దంతాలపై వివిధ పరిశోధనలు చేసిన వారు ఈ విషయాన్ని నిర్థారించారు. మాస్కోలో భద్రపరిచిన ఆ దంతాలపై ఇటీవలే ఆ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. "యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసన్" అనే సైన్స్ పత్రికలో ఈ విషయం ప్రచురితమైంది. 2017లో తొలిసారిగా రష్యన్ సీక్రెట్ సర్వీస్ హిట్లర్ దంతాలను సేకరించి.. ఆయన మరణ రహస్యాన్ని ఛేదించాలని భావించింది.


అయితే హిట్లర్ సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా బులెట్‌తో కాల్చుకొని చనిపోయాడా అన్న అంశం కూడా తమ పరిశోధనలో తేలాల్సి ఉందని ఫ్రెంచి శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకోసం ఆయన పుర్రెని కూడా పూర్తిస్థాయిలో పరీక్షించాలని యోచిస్తున్నామని అన్నారు. మెడికల్ లీగల్ ఆంత్రోపాలజీ రంగంలో పరిశోధనలు చేసిన ఈ శాస్త్రవేత్తలు ప్రస్తుతం హిట్లర్ మరణ రహస్యాన్ని చేధించే పనిలో ఉన్నారు.