హత్య జరిగిన 35 ఏళ్లకి.. నేరస్తుడి అరెస్టు
అమెరికాలో 35 ఏళ్ల క్రితం కెనడాకి చెందిన ఓ జంటను ఓ ఆగంతకుడు హత్య చేశాడు.
అమెరికాలో 35 ఏళ్ల క్రితం కెనడాకి చెందిన ఓ జంటను ఓ ఆగంతకుడు హత్య చేశాడు. హత్య చేసినప్పుడు జరిగిన పెనుగులాటలో భాగంగా ఆ జంట శరీరంపై నేరస్తుడి గోరుగాట్లు కూడా ఏర్పడ్డాయి. ఆ గాట్ల నుండి అప్పట్లో నేరస్తుడి డీఎన్‌ఏని సేకరించి భద్రపరిచారు పోలీసులు. కానీ అతన్ని మాత్రం కనుగొనలేకపోయారు. ఇటీవలి కాలంలో "జీఈడీ మ్యాచ్" అనే డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతూ నేరస్తుల పూర్వీకుల వివరాలను సంపాదించే ప్రయత్నంలో పడ్డారట అమెరికన్ పోలీసులు.
ఈ డేటాబేస్ ద్వారా ప్రస్తుతం తమ వద్ద ఉన్న డీఎన్‌ఏ వివరాలతో ఇతర పౌరుల డీఎన్‌ఏలు మ్యాచ్ చేసి పూర్వీకుల వివరాలు కనగొనే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో 1987లో జరిగిన కెనడా జంట హత్యకేసులో దొరికిన ఆగంతకుడి డీఎన్‌ఏ వివరాలను కూడా తమ దగ్గరున్న డీఎన్‌ఏ వివరాలతో మ్యాచ్ చేయగా.. పలువురి వివరాలు లభించాయట. అందులో ఓ డీఎన్‌ఏతో తమ దగ్గరున్న డీఎన్‌ఏ 100 శాతం మ్యాచ్ అయ్యిందట.
ఆ డీఎన్‌ఏ ఎవరిదన్న విషయాన్ని పోలీసులు ఆరా తీయగా.. అది టాల్బాట్ అనే ట్రక్కు డ్రైవర్‌ది అని తేలింది. అయినా సరే ఒకసారి పూర్తిస్థాయి నిర్థారణ చేయాలని భావించిన పోలీసులు ఆ ట్రక్ డ్రైవర్ వాడిన కాఫీ కప్పును సంపాదించి మళ్లీ డీఎన్‌ఏ టెస్టు చేశారట. ఈసారి ఫలితం పాజిటివ్‌గానే వారు అతన్ని అరెస్టు చేశారు. అయితే హత్య జరిగిన 35 సంవత్సరాల తర్వాత తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను చూసి ఆ ముసలి ట్రక్కు డ్రైవర్ ఆశ్చర్యపోయాడు.