కరాచీ : ఓ వైద్యుడి నిర్వాకం కారణంగా 90 మంది అమాయకులకు అకారణంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. బాధితుల్లో 65 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇంజెక్షన్స్ ఇచ్చే క్రమంలో కలుషిత సిరంజీలను వినియోగించడం వల్లే ఆ 90 మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకివెళ్తే, ఇటీవల లర్కానా నగర పరిసర ప్రాంతాల్లో 18 మంది చిన్నారులకు ఎయిడ్స్ వ్యాధి సోకినట్టు గుర్తించిన అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్లకి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వైద్యపరీక్షల్లో మరో 72 మందికి ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అవడంతో అంతా షాక్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90 మందికి హెచ్ఐవి పాజిటివ్ అని నిర్దారణ అవడంతో వాళ్లంతా ఇటీవల కాలంలో ఏదైనా ఆస్పత్రిలో కానీ లేదా ఒకే డాక్టర్ వద్ద కానీ చూపించుకోవడం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే.. బాధితులు అంతా వివిధ సందర్భాల్లో స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకునే సమయంలో అతడు కలుషిత సిరంజీలను వాడాడని, అందువల్లే వారికి ఎయిడ్స్ వ్యాధి సోకిందని స్పష్టమైంది. 


అయితే, సదరు వైద్యుడికి కూడా ఎయిడ్స్ వ్యాధి సోకిందని తెలుసుకుని మరింత షాకవడం పోలీసుల వంతయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వైద్యుడిని అరెస్ట్ చేసినట్టు స్థానిక పోలీసు అధికారి కమ్రాన్ నవాజ్ తెలిపారు.