ఢిల్లీ: ఎట్టకేలకు డోక్లామ్ వివాదం సుఖాంతంగా ముగిసింది. ఈ  ప్రాంతంలో ఉన్న తన బలగాలను వెనక్కి రప్పించేందుకు చైనా అంగీకరించింది. ఈ విషయాన్ని భారత  విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో  70 రోజులుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. ఈ అంశంపై భారత విదేశాంగ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ..గత నెలలో చైనా పర్యటన సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ డోక్లాం వివాదంపై చైనా జాతీయ భద్రతా సలహాదారుతో కీలక చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా వివాదాస్పద ప్రాంతం డోక్లామ్ నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డోక్లామ్ వివాదంపై భారత్ - చైనాలు  ద్వైపాక్షిక సంప్రదింపులు సమయంలో ఇరు దేశాలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి. డోక్లామ్ విషయంలో తమకున్న అభ్యంతరాలు, ఆందోళనలను ఒకరికొకరు ఈ సందర్భంగా  తెలుసుకున్నాయి. అంతిమంగా చర్చలు సఫలం కావడంతో ఇరుదేశాలు బలగాలను వెనక్కి రప్పించేందుకు అంగీకరించాయి.


చైనా మేకపోతు గాంభీర్యం...


డోక్లామ్ అంశంపై చైనా స్పందిస్తూ తమ బలగాలను ఉపసంహరింలేదని..పరిస్థితుల మేరకు మార్పులు ఉంటాయని పేర్కొంది. చైనా ప్రకటనతో మళ్లీ సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి ఈ పరిస్థితుల్లో భారత్ తో పోరుకు దిగితే తమ ఎంత నష్టమో తెలుసుకున్న చైనా వెనక్కితగ్గిందని.. అయితే ప్రపంచం దృష్టిలో పరువుపోతుందనే భయంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 


బ్రిక్స్ సదస్సు కారణమా..?


మరో వారంలో చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకావాల్సి ఉంది. ఈ వేదికపై భారత ప్రధాని   చైనా  తీరును ఎండగడితే అంతర్జాతీయంగా ఆ దేశం పరువుపోతుంది. అందుకే చైనా సర్కార్ తన బలగాలు వెనక్కి రప్పించాడానికి ఇదొక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధవాతావరణం ఇరు దేశాలకు ఏ మాత్రం శ్రేయస్సు కాదు.. తాజా పరిణామంతో ఇరు దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.