పారిస్: కత్తితో ఉగ్రవాది దాడి.. ఒకరు మృతి
ప్రాన్స్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది చెలరేగిపోయాడు.
ప్రాన్స్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది చెలరేగిపోయాడు. పౌరులపై కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి సెంట్రల్ ప్యారిస్‌లో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాది దాడిలో ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.
వీకెండ్ కావడంతో ప్యారిస్ ఓపెరా హౌజ్ జనంతో కిటకిటలాడుతోంది. ఇంతలో ఓ వ్యక్తి 'అల్లాహూ అక్బర్' అని నినాదాలు చేస్తూ కత్తితో దాడి చేయడం, గాయపరచటం ప్రారంభించాడు. పక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా, జనం ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఉగ్రవాదిని కాల్చి చంపారు. ఉగ్రదాడిపై అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రోన్ ‘ఫ్రాన్స్ మరోసారి నెత్తురు చిందించింది. కానీ, శత్రువులకు ఇంచుకూడా అవకాశం ఇవ్వలేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ ఉగ్రదాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2015 నవంబర్ 13న చోటు చేసుకున్న మారణహోమంలో 130 మంది మరణించారు.