మీ కదలికలను గూగుల్ ట్రాక్ చేస్తోంది.. జాగ్రత్త గురూ!
మనం వద్దని స్పష్టంగా చెప్పినా గూగుల్ మన కదలికల్ని ట్రాక్ చేస్తోందట.
మనం వద్దని స్పష్టంగా చెప్పినా గూగుల్ మన కదలికల్ని ట్రాక్ చేస్తోందట. మొబైల్‌తో మనం చేసే ప్రతి అడుగులను గూగుల్ పసిగట్టుతుందని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు. తమ విచారణలో ఈ విషయం వెల్లడైనట్లు అసోసియేట్ ప్రెస్ తెలిపింది.
ఆండ్రాయిడ్ డివైజ్‌లు, ఐఫోన్ స్టోర్లలో లభించే చాలా గూగుల్ సర్వీసులు మన లొకేషన్ డేటాను సేవ్ చేస్తుంటాయని.. అలా చేయకూడదని ప్రైవసీ సెట్టింగ్స్‌లో మనం మార్పులు చేసినప్పటికీ అవి తమ పని కానిచ్చేస్తున్నాయని ప్రిన్స్‌టన్‌లోని కంప్యూటర్ సైన్స్ పరిశోధనకులు తేల్చారు.
లొకేషన్ డేటాను రికార్డు చేయడం ద్వారా వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం వెళ్లిన ప్రదేశాలన్నీ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో హిస్టరీగా నమోదవుతాయని.. ప్రైవసీ లాక్ పెట్టుకున్నా తన నుంచి వచ్చిన ఇతర యాప్‌ల ద్వారా గూగుల్ డేటాను పొందుతుందని తెలిపారు. ప్రైవసీ ఆప్షన్ పూర్తిగా నమ్మదగినది కాదన్నారు. ప్రపంచంలో 2 బిలియన్ ఆండ్రాయిడ్ యూజర్లు, మిలియన్ల మంది ఐఫోన్ యూజర్ల కదలికలు గూగుల్ వద్ద ఉన్నాయట.
లొకేషన్ హిస్టరీ సేవ్ కాకుండా చూసుకోవడానికి ఒకే మార్గం ఉంది. ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’ మరో సెట్టింగ్ ఉంటుంది. గూగుల్ యాప్స్, వివిధ వెబ్‌సైట్ల నుంచి అందే సమాచారాన్ని ఈ సెట్టింగ్.. మీ గూగుల్ అకౌంట్‌లో సేవ్ చేస్తుంది. దీన్ని ఆపేస్తే ఏ సమాచారమూ గూగుల్ అకౌంట్‌లో సేవ్ అవదు. వెబ్ అండ్ యాప్ యాక్టివిటీని ఆపకుండా లొకేషన్ హిస్టరీని మాత్రమే ఆపితే మీ కదలికలు గూగుల్‌కు వెళ్తాయి.