2022లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి భారత వ్యోమగామి
రోదసీలో భారత త్రివర్ణ పతాక రెపరెపలాడబోతోంది. త్వరలోనే భారత వ్యోమగామి రోదసీలో ప్రయాణించబోతున్నారు. 2022లో రష్యా తన సూయజ్ అంతరిక్ష నౌకలో భారత వ్యోమగామిని స్వల్పకాలిక శిక్షణ కోసం అంతర్జాతీయ రోదసీ కేంద్రానికి తీసుకెళ్లనుంది. ఈ మేరకు రోదసీ యాత్ర చేపట్టే రష్యా వ్యోమగాముల జట్టులో భారత సహచరులను తీసుకెళ్లేందుకు వారు అంగీకరించారు. ఇందుకు సంబంధించిన అంశాలపై త్వరలోనే ఒప్పందం జరుగుతుందని రష్యన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
భూ కక్ష్యలో ఏర్పాటు చేసిన నివాసయోగ్యమైన కృత్రిమ ఉపగ్రహమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్). స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో కూడా 2022 నాటికి భారత వ్యోమగామి దేశీయంగా తయారైన రోదసీనౌక లో ‘గగన్ యాన్‘ చేయనున్నట్టు ప్రకటించారు. అదే జరిగితే అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగో దేశం అవుతుంది.
1984 ఏప్రిల్ 2న అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. ఆయన భారతీయ వైమానిక దశంలో పైలెట్ గా పనిచేశారు. ఆయన అంతరిక్షంలోకి ప్రయాణించినపుడు సోవియట్ యూనియన్ సోయుజ్ టి-11లోభాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత మనదేశంలో జన్మించిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్ కూడా అంతరిక్షంలోకి వెళ్లిన వారి జాబితాలో నిలిచారు. అయితే కొలంబియా విపత్తులో మరణించిన ఏడుగురు సభ్యుల్లో కల్పనా చావ్లా ఉన్నారు. 2003లో భూ వాతావరణంలోకి తీరిగి ప్రవేశించే సమయంలో వారు చనిపోయారు.