భారత్‌లో పేదరికం తగ్గుముఖం పడుతోంది. 2030నాటికి దేశంలో పేదరికం కనుమరుగవుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. దేశంలో ప్రతి నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయటపతున్నారని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ అధ్యయన సంస్థ బ్రూకింగ్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. పేదరికం పెరుగుతున్న దేశాలలో నైజీరియా అగ్రస్థానంలో నిలిచిందని, అక్కడ నిమిషానికి ఆరుగురు పేదరికం బారిన పడుతున్నారని బ్రూకింగ్స్‌ నిర్వహించి అధ్యయంలో తేలింది. ‘ద స్టార్ట్‌ ఆఫ్‌ ఏ న్యూ పావర్టీ నరేటివ్‌’ పేరున బ్రూకింగ్స్‌ తన బ్లాగులో దీన్ని ఉంచింది.


మొత్తం 188 అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు, ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని బ్రూకింగ్స్‌ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. అత్యంత ఎక్కువమంది పేదలతో నైజీరియా ప్రథమ స్థానాన్ని,  రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో రెండో స్థానంలో ఉన్నాయి. 2018 మే నాటికి నైజీరియాలో 8.7 కోట్ల మంది నిరుపేదలు ఉండగా, భారత్‌లో వారి సంఖ్య 7.3 కోట్లేనని తేల్చారు. 2022 నాటికి ఇండియాలో పేదరికం 3 శాతానికి తగ్గుతుందని, 2030 నాటికి పేదరికం పూర్తిగా తొలగిపోతుందని నివేదిక వెల్లడించింది. భారత్‌లో తలసరి ఆదాయం వృద్ధి చెందడమే పేదరికం తగ్గుదలకు కారణమట.