పాక్ `మహాకుట్ర`ను భగ్నం చేసిన భారత ఆర్మీ.. వీడియో రిలీజ్
దొడ్డి దారిన దాడి చేయాలనుకున్న పాకిస్తాన్ కు భారత ఆర్మీ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.
భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ సర్కార్ ప్లాన్ చేసిన మహాకుట్రను భారత ఆర్మీ భగ్నం చేసింది. అండర్ బారెల్ గ్రనేడ్ లాంఛర్లతో భారత సరిహద్దుల్లో ప్రవేశించేందుకు యత్నించిన పాక్ కు చెందిన ప్రత్యేక దళ సభ్యులను మన జవాన్లు తరిమికొట్టారు.
పాక్ ఆర్మీ కమాండర్లు, ఉగ్రవాదుల కలయికగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ ' ఎస్ఎస్‌జీ' పేరుతో బృందాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ సర్కార్... భారత భూభాగంలోకి హింసను సృష్టించేందుకు ప్రయత్నించింది. భారత్ లో అక్రమంగా ప్రవేశించేందుకు చేస్తున్న పాక్ దుశ్చర్యను ముందే పసిగట్టిన భారత భద్రతాబలగాలు ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
ఈ నెల 12, 13 తేదీల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ విడుదల చేసింది. భారత సైన్యం పాక్ మూకలపై గ్రనేడ్లు విసురుతూ నిరోధించిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.
కశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుతగిలేందుకు విఫలయత్నం చేసిన పాక్.. భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో రగిలిపోతోంది. ఈ క్రమంలో దొడ్డి దారిలో వెన్నుపోటు పొడిచేందుకు ఇలా మరో మారు విఫలయత్నం చేసింది.