అమెరికాలో అరెస్ట్ అయిన 129 మంది భారతీయ విద్యార్థుల కోసం ఎంబసీ హాట్ లైన్ ఏర్పాటు
అమెరికాలో అరెస్ట్ అయిన 129 మంది భారతీయ విద్యార్థుల కోసం భారత రాయబార కార్యాలయం హాట్ లైన్ ఏర్పాటు
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే ఇంకొంత కాలం ఉండేందుకు ఫేక్ యూనివర్శిటీలో ప్రవేశాలు పొందిన 129 మంది భారతీయ విద్యార్థులను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలో 'పే అండ్ స్టే' యూనివర్శిటీ వీసా కుంభకోణంలో చిక్కుకుని అరెస్ట్ అయిన బాధితులకు అండగా నిలిచేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం 24/7 హాట్‌లైన్‌ను ప్రారంభిస్తూ రెండు హెల్ప్ లైన్ నెంబర్లను 202-322-1190, 202-340-2590 ప్రకటించింది. అరెస్ట్ అయిన విద్యార్థులను విడిపించేందుకు న్యాయ సహాయం అందించనున్నట్టు ఎంబసీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా అరెస్ట్ అయిన విద్యార్థుల స్నేహితులు, బంధువులు cons3.Washington@mea.Gov.In ద్వారా రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించవచ్చని తెలిపింది.
అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించేందుకు, ఇమ్మిగ్రేషన్ మోసాలను వెలికి తీసేందుకు డెట్రాయిట్‌లోని ఫర్మింగ్టన్ హిల్స్‌లో ఓ యూనివర్శిటీని ప్రారంభించిన అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ విభాగం అక్కడ వారికి ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించింది. అయితే, అదంతా అమెరికా అంతర్గత భద్రత విభాగమైన అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ విభాగం నిర్వహిస్తోన్న రహస్య ఆపరేషన్ అని తెలియని విదేశీ విద్యార్థులు అందులో ప్రవేశాలు పొందేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారని పీటీఐ వెల్లడించింది.